రైతు వేదికలకు సౌర వెలుగులు! | - | Sakshi
Sakshi News home page

రైతు వేదికలకు సౌర వెలుగులు!

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

ఆలేరురూరల్‌ : రైతు వేదికలకు సౌర వెలుగులు తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో సౌర పలకల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. సౌర పలకలు అమర్చేందుకు ప్రభుత్వం రంగ సంస్థ అయిన హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం (హాకా)కి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల వారీగా రైతు వేదికల భవనాల పరిస్థితిపై నివేదికలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయాధికారులు నివేదికలు తయారు చేసే పని నిమగ్నమయ్యారు.

నిధుల్లేక నిర్వహణ భారంగా..

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని ఉద్దేశంతో వివిధ పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2021లో జిల్లా వ్యాప్తంగా 92 క్లస్టర్లలో ఒక్కోదానికి రూ.22 లక్షలు వెచ్చించి మొత్తం రూ.20.24 కోట్లతో వేదికలు నిర్మించింది. వీటి నిర్వహణకు నెలకు రూ.9వేలు మంజూరు కాగా 2023 సెప్టెంబర్‌ నుంచి నిధులు మంజూరు కావడంలేదు. దీంతో రైతు వేదికల నిర్వహణ ఏఈఓలకు భారంగా మారింది.

రక్షణ లేక చోరీలు

వేదికలకు రక్షణ లేకపోవడంతో రాత్రిళ్లు చోరీలు జరుగుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. చాలాచోట్ల ఎలక్ట్రిక్‌ పరికరాలు, బ్యాటరీలు, విలువైన వస్తువులు తదితరాలు చోరీ చేశారు. దీనికితోడు రైతు వేదికల్లో నీటి వసతి లేక రైతులు, వ్యవసాయశాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వేదికలను శుభ్రం చేసుందుకు, సమావేశాలకు కుర్చీలు వేసేందుకు స్వీపర్లు కూడా లేరు, అన్నీ ఏఈఓలే చూసుకుంటున్నారు. పైగా కొన్ని రైతు వేదికలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందు విద్యుత్‌ సౌకర్యమైనా కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం రైతు వేదికల్లో సోలార్‌ పలకలు ఏర్పాటు చేసి నేరుగా విద్యుత్‌ ఉత్పత్తి చేసి వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. అయితే జిల్లా స్థాయి నుంచి నివేదికలు అందిన వెంటనే ఒక్కో రైతు వేదికలో సౌర పలకల ఏర్పాటుకు బడ్జెట్‌ ఎంత అవుతుందనే అంచనా వేసి కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

ఫ భవనాల పరిస్థితిపై నివేదికలు కోరిన ప్రభుత్వం

ఫ జిల్లా వ్యాప్తంగా 92 రైతు వేదికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement