గుండాల : కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీటి గోస పెడుతున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై ఆదివారం గుండాల మండలం అనంతారం గ్రామ బిక్కేరు వాగులో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరాన్ని ఎండబెట్టి మిగులు జలాలు సముద్రం పాలు చేస్తున్నారన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుండాల మండలాన్ని సస్య శ్యామలం చేసేందుకు రూ.140 కోట్లు విడుదల చేసి కాల్వవలు తవ్వించినప్పటికీ దేవాదుల నీరును ఎందుకు విడుదల చేస్తలేరని ప్రశ్నించారు. 15 రోజుల్లో రైతులకు నీటిని విడుదల చేయకపోతె అఖిలపక్షంతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కుర్మిళ్ల కవిత, ఆలకుంట్ల సుధాకర్, వినోద్, అల్లంశెట్టి మహేష్, నాయకులు మందడి రామకృష్ణారెడ్డి, మద్దుల బాల్‌రెడ్డి, శ్రీనివాస్, మొగులాల్, ఉప సర్పంచ్ నగేష్, సీపీఐ నాయకులు హరిశ్చంద్ర, స్వామి తదితరులు పాల్గొన్నారు.


