బ్లాక్ మార్కెట్‌లో దోపిడీ
భువనగిరి, సంస్థాన్ నారాయణపురం: పశ్చిమాసియాలో సంక్షోభం ముగిసినప్పటికీ, దాని ప్రభావం వంటగ్యాస్ సరఫరాపై ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్యాస్ ఏజెన్సీల ద్వారా నూతన కనెక్షన్లు జారీ చేయడం, రెండో సిలిండర్ మంజూరు చేయడాన్ని అధికారులు నిలిపివేశారు. గత నాలుగు నెలలుగా సంబంధిత వెబ్‌సైట్ సైతం పనిచేయకపోవడంతో కొత్త కనెక్షన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కొత్తగా పెళ్లయి వేరు కాపురం పెట్టినవారు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇళ్లలో చేరినవారు, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరైనవారికి వంటగ్యాస్ కనెక్షన్లు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్క సిలిండర్‌తో తీవ్ర అవస్థలు
కొత్త కనెక్షన్ల సమస్య ఒకవైపు ఉంటే, ఉన్న కనెక్షన్‌కు సంబంధించి ఒకే సిలిండర్ ఉన్న కుటుంబాలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ ఖాళీ అయితే వెంటనే మరో సిలిండర్ అందే పరిస్థితి లేకపోవడంతో పెద్ద కుటుంబాల్లో వంట నిలిచిపోతోంది. అదనపు సిలిండర్ సరఫరాపై స్పష్టత ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు.
రీఫిల్‌కు తప్పని నిరీక్షణ
ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్‌కు సంబంధించి మార్చి 25న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం.. రీఫిల్ బుకింగ్ వ్యవధి పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ కాలపరిమితి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
రీఫిల్ బుకింగ్ సమయం అధికంగా ఉండటంతో అత్యవసర సమయాల్లో వినియోగదారులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. సాధారణ బుకింగ్ విధానంలో సిలిండర్ ధర రూ.1,000 నుంచి రూ.1,050 వరకు ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో రూ.1,300 నుండి రూ.1,500 వరకు తీసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, గోదాములు, డెలివరీ వాహనాలపై అధికారులు నిఘా పెంచి అక్రమ విక్రయాలను అరికట్టాలని, నూతన కనెక్షన్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ పశ్చిమాసియా యుద్ధంతో కొత్త కనెక్షన్లకు బ్రేక్
ఫ అదనపు సిలిండర్, నూతన కనెక్షన్ల కోసం ఎదురుచూపులు
ఫ రీఫిల్‌కు 45 రోజుల వరకు గడువు నిబంధన
ఫ బ్లాక్ మార్కెట్‌లో రూ.1,300 నుంచి రూ.1,500 వరకు వసూలు
జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు
ఏజెన్సీలు 20
మొత్తం కనెక్షన్లు 2,92,487
గృహ అవసరాలు 1,85,070
వాణిజ్య అవసరాలు 2,354
దీపం 53,920
ఉజ్వల 13,777
ఇతర కనెక్షన్లు 37,366


