యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యారాధనలు సంప్రదాయంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, ఆరాధన, స్వయంభువులకు నిజాభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. ఇక ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద సువర్ణ పుష్పార్చన వంటి పూజలు జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవోత్సవం వంటి పూజలను జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. కాగా శనివారం ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. శ్రావణ మాసంలో శ్రీస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు అధికంగా తరలివచ్చారు.


