మోత్కూరు : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తన గురువు కల్వల ప్రకాష్ రాయుడును మోత్కూరులోని ఆయన నివాసంలో శనివారం కలిసి ఘనంగా సన్మానించారు. గురువుకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన గురువును కలిసి సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తన విద్యాభ్యాస కాలంలో గురువు ప్రకాష్‌రాయుడు చేసిన విద్యా బోధన, అందించిన మార్గదర్శకత్వం తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో గురువుల ప్రోత్సాహం, ఆశీస్సులు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేది ఉపాధ్యాయులేనని అన్నారు. కల్వల ప్రకాష్‌రాయుడు మాట్లాడుతూ తన శిష్యుడు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. గురువులను గౌరవించే సంప్రదాయం కొనసాగాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచకొండ బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్, కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య, డాక్టర్ లక్ష్మీనర్సింహారెడ్డి, బద్దం నాగార్జున్‌రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, విజయ భాస్కర్‌రెడ్డి, గడ్డం సోమనర్సయ్య, గనగాని నర్సయ్య, అవిశెట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు.


