ఫ గురుశిష్యుల పవిత్రబంధానికి బీటలు
ఫ సామాజిక మాధ్యమాల ప్రభావంతో పెడదారి పడుతున్న విద్యార్థులు
గురువులంటే కేవలం చదువు చెప్పేవారు మాత్రమే కాదు. ఒక భావితరాన్ని నిర్మించే శక్తి. వారు చూపే మార్గంలో పెరిగే విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. సమాజంలో తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే. కానీ ప్రస్తుతం మారుతున్న కాలంలో విలువలు కూడా మారుతున్నాయి. గురుశిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్రబంధానికి బీటలు వారుతున్నాయి. సామాజిక మధ్యమాల ప్రభావంతో పాటు ఉరుకుల పరుగుల జీవితంలో తమ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గిపోవడంతో పెడదారి పడుతున్నారు. తప్పులు చేస్తున్న విద్యార్థులపై ఉపాధ్యాయుల చిరు మందలింపును కూడా తట్టుకోలేకపోతున్నారు. గురువులను ఎదురించడమే కాదు భౌతిక దాడులకు కూడా వెనకాడని పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు.. సమాజానికి దిక్చూచిలా ఉండాల్సిన కొందరు గురువులు వృత్తి ధర్మాన్ని మరిచి విద్యార్థినులను చెరపడుతున్న సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకోవడం బాధాకరం. గురుశిష్యుల మధ్య నమ్మకం, గౌరవం, స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. విద్యార్థులను గురువులు తమ సొంత పిల్లలుగా చూసుకోవాలి. విద్యార్థులు కూడా గురువులను మార్గదర్శకులుగా గౌరవించినప్పుడే గురుశిష్యుల మధ్య బంధం పదిలంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే గురువులకు.. గురువులను దేవుళ్లుగా భావించే గౌరవించే విద్యార్థులకు టీచర్స్ డే శుభాకాంక్షలు.
– సాక్షి నల్లగొండ డెస్క్


