పెద్దవూర : విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతిచెందాడు. సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం లింగపల్లి శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. అనుముల మండలం కొట్టాల గ్రామానికి చెందిన బైరు రామలింగయ్య(25) పెద్దవూర మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. శుక్రవారం కౌలుకు తీసుకున్న భూమిలో వరి నాట్లు వేయడానికి కూలీలను పిలిచాడు. గురువారం రాత్రి తన స్నేహితుడు కొప్పెర నాగరాజుతో కలిసి బోరు మోటార్ ద్వారా నీళ్లు పెట్టడానికి కౌలు భూమి వద్దకు వెళ్లాడు. బోరు మోటార్ ఆన్ చేసినా నీళ్లు రాకపోవడంతో.. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా ఉందో లేదో తెలుసుకోవడానికి స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు రామలింగయ్య విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే స్నేహితుడు నాగరాజు.. రామలింగయ్య తండ్రి వెంకటేశ్వర్లు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వచ్చిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఆసుపత్రికి తరలించారు. రామలింగయ్య తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు.


