భువనగిరి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మదనవేణుగోపాలస్వామి, పద్మావతి అమ్మవార్లకు నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మానేపల్లి రామారావు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.
జాతీయ క్రీడాకారిణులకు
మంత్రి పొన్నం ప్రశంసలు
చిట్యాల: కౌలాలంపూర్‌లో గత నెలలో జరిగిన సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ చాంఫియన్‌షిప్–2026 పోటీల్లో కాంస్య పతకం సాధించిన జాతీయ లాక్రోస్ జట్టు సభ్యుల్లో చిట్యాల మున్సిపాలిటీకి చెందిన చిర్రబోయిన సంగీత, నల్లగొండకు చెందిన గోపికలు సభ్యులుగా ఉన్నారు. వీరు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరిని ఆయన సన్మానించారు. గురుకులాల సొసైటీ తరపున ఒక్కొక్కరికి రూ.లక్షా 76వేలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగుల సైదులు, ఫిజికల్ డైరెక్టర్లు అంజలి, మమత, శోభ, కోచ్‌లు శివకుమార్, అకాష్, తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్ అధ్యక్షుడు లతీపుద్దిన్, జనరల్ సెక్రటరీ భానుచందర్ పాల్గొన్నారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. కొత్త గుండ్లపల్లికి చెందిన ముక్కెర్ల సత్తయ్య (70) గురువారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమయ్యాడు. శుక్రవారం గ్రామానికి సమీపంలోనే నల్ల చెరువులో చేపలకు వేసే గాలానికి చిక్కుకొని మృతిచెంది ఉన్నాడు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


