సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయుడంటే కేవలం తరగతి గదిలో పాఠాలు చెప్పేవాడు కాదు.. సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచేవాడు అనే పదానికి నిదర్శనం రాచకొండ ప్రభాకర్. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసముంటూ మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ, ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభాకర్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, జాగ్రత్తగా వాహనాలు నడపడం వంటి అంశాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉపయోగపడేలా శ్రీచేయూత దుస్తుల బ్యాంకుశ్రీ ఏర్పాటు చేసి దాతల నుంచి దుస్తులు సేకరిస్తున్నారు. దాతల సహకారంతో నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు సేకరించి పేద విద్యార్థులకు అందిస్తూ వారి చదువుకు అండగా నిలుస్తున్నారు. విద్య అంటే పుస్తకాల్లోని పాఠం మాత్రమే కాదు.. జీవితాన్ని, సమాజాన్ని మార్చే శక్తి అనే ఆలోచనకు ఆయన సేవా కార్యక్రమాలు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.


