నాగార్జునసాగర్ : సాగర్ జలాశయ తీరంలో రూ.4 కోట్ల వ్యయంతో మొత్తం మూడు పంట్ల (లాంచీ ఎక్కేందుకు వినియోగించేవి) తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిలో రెండు పంట్లను నాగార్జునసాగర్ పర్యాటకుల కోసం కేటా యించగా, వాటిలో ఒకటి నాగార్జునకొండ వద్ద, మరొకటి సాగర్ తీరంలో ఉంటాయని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. మూడో పంటును సోమశిల ప్రాజెక్టు కోసం తయారు చేశారు. ఈ పంటు నిర్మాణం పూర్తి కావడంతో సోమవారం దానిని లారీలో సోమశిల వద్దకు తరలించారు. విశాఖపట్నానికి చెందిన మా తారా మైరెన్ అండ్ షిప్‌యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇండియన్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) ఈ పంట్ల నిర్మాణానికి ఆర్డర్ ఇచ్చింది. వారు ఈ పనులను కోల్‌కతాకు చెందిన బ్లూవేస్ మ్యాన్‌పవర్ అనే సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ సిబ్బంది సాగర్ తీరంలోనే ఉంటూ ఒక పంటును పూర్తిచేశారు. మిగిలిన రెండింటిని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అధునాతన సౌకర్యాలతో..
ప్రస్తుతం సాగర్‌లో పర్యాటకులు లాంచీలు ఎక్కేందుకు వినియోగిస్తున్న పంట్ల కంటే, నూతనంగా తయారవుతున్న పంట్లు ఒక్కొక్కటి 6 మీటర్ల వెడల్పు, 24 మీటర్ల పొడవుతో పెద్దగా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఇంజిన్లు కూడా అమర్చనున్నా రు. దీంతో అవసరాన్ని బట్టి కొంత దూరం వరకు నీటిలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. వీటిపై కార్లు, జేసీబీల లాంటి భారీ యంత్రాలను తరలించవచ్చు. ప్రస్తుతానికి పర్యాటకులు లాంచీ ఎక్కేందుకు, దిగేందుకు వీటిని వినియోగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఈ నూతన పంట్లు అందుబాటులోకి వస్తే సాగర్ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రూ.4 కోట్లతో మూడు పంట్ల
తయారీకి నిర్ణయం
ఇప్పటికే ఒకదాని పనులు పూర్తి
మిగతా రెండు తయారైతే సాగర్ జలాశాయానికి కేటాయింపు


