● యాదగిరి కొండపై ఘటన
యాదగిరిగుట్ట : పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగులగొట్టి అందులోని సెల్‌ఫోన్లు, చిన్న వెండి ప్లేట్లు అపహరించిన సంఘటన సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన చోటు చేసుకుంది. ఎస్‌పీఎఫ్ సీఎస్‌ఓ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కారులో యాదగిరీశుడిని దర్శనానికి వచ్చాడు. శివాలయానికి వెళ్లే దారిలోని ర్యాంప్ సమీపంలో కారును పార్క్ చేశాడు. దర్శనానికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారు వెనక భాగంలో అద్దం పగులగొట్టి, అందులో ఉన్న రెండు సెల్‌ఫోన్లు, అన్న ప్రాసన చేసే చిన్న వెండి ప్లేట్‌ను అపహరించారు. ఈ విషయమై బాధితుడు కొండపైన ఈఓ భవాని శంకర్‌కు తెలిపారు. ఇప్పటికే ఓ వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సీఎస్‌ఓ పేర్కొన్నారు.
జీవితంపై విరక్తితో
వ్యక్తి ఆత్మహత్య
గుర్రంపోడు : మండలంలోని పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి యాదగిరి(43) సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం యాదగిరి పదేళ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో తన అనారోగ్యం గురించి ఆలోచిస్తూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వ్యవసాయం చేయడంతోపాటు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి తమ్ముడు బైరి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రియాక్టర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో ఆగస్టు 21న అర్ధరాత్రి రియాక్టర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వేదుల చెన్నకేశవులు (38) ఆదివారం మృతిచెందాడు. పోస్ట్‌మార్టమ్ అనంతరం పోలీ సులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా వేదుల చెన్నకేశవులు హెజిలో ఫార్మా కంపెనీలో 2021లో కెమిస్ట్రీగా విధుల్లో చేరాడు. మృతుడికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న చెన్నకేశవులు మృతిచెందడంలో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.
కాల్వలోపడి
మేకలకాపరి మృతి
నిడమనూరు : సాగర్ కాల్వ వెంట మేకల మేపుతున్న కాపరి మైనర్ కాల్వలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన కంసాని దుర్గయ్య(59), భార్య అంజమ్మతో కలిసి సాగర్ ఎడమకాల్వ వెంట నారెళ్లగూడెం మేజర్ వద్ద మేకలు మేపుతుండగా మైనర్ కాల్వలో జారిపడ్డాడు. గుర్తించిన భార్య అంజమ్మ సాయమందించే సరికే నీటి ప్రవాహానికి కొట్టుకపోయి, నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దుర్గయ్య కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.


