నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ నిరసన దీక్ష చేపట్టారు. ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు 40 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవుపల్లి మండలం చిట్యాల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నాగవెల్లి ఉపేందర్ ఆగస్టు 23న మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని గౌరీశంకర్ ఆలయం వద్ద గుండు కొట్టించుకొని పాదరక్షలు లేకుండా నల్ల చొకా వేసుకొని ఈ దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా చలనం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టినట్లు ఉపాధ్యాయుడు ఉపేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల వరకు సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని వారి ఆశలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తన దీక్షతోనైనా ప్రభుత్వ పెద్దల మనస్సు మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గుండుకొట్టించుకొని.. పాదరక్షలు లేకుండా నల్లచొక్కతో విధులకు


