కేతేపల్లి : రెండు ఆటోలు ఢీకొనడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం నకిరేకల్ నుంచి ప్రయాణికులతో సూర్యాపేటకు వెళ్తున్న ఆటోను కేతేపల్లి మండలంలోని చీకటిగూడెం శివారులోని 65 జాతీయ రహదారి గల సాయికృష్ణ హోటల్ సమీపంలో వెనకాల వస్తున్న ట్రాలీ ఆటో ఢీకోట్టింది. ఇదే సమయంలో ఆటోల వెనకాలే హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తున్న సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని గ్రహించి బస్సును కుడి వైపుకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. ప్రమాదానికి కారణమైన రెండు ఆటోలు రోడ్డు పక్కనే ఉన్న గుంతల్లోకి దూసుకెళ్లి పల్టీకొట్టాయి. ఈప్రమాదంలో ముందున్న ఆటోలో ప్రయాణిస్తున్న ఎన్.సైదులు, మహమ్మద్‌లకు తీవ్రగాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్టయ్యింది. క్షతగాత్రులను 108 వాహనంలో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేతేపల్లి పోలీసులు ప్రమాద ఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు


