చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో అండర్‌పాస్ నిర్మాణంలో భాగంగా నవోదయ టాకీస్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రారంభ పాయింట్ నుంచి వలిగొండ రోడ్డు వరకు పనులు సాగుతున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్టాండ్, చిన్నకొండూర్ రోడ్డు, తంగడపల్లి రోడ్డు వద్ద జంక్షన్లను మూసివేశారు. ఆ ప్రాంతాల మీదుగా వాహనాలు వెళ్లకుండా సిమెంట్ దిమ్మెలు అడ్డుగా పెట్టారు. ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద జనం కాలినడకన రాకపోకలు సాగించేందుకు చిన్నపాటి దారి కేటాయించారు. గురువారం సాయంత్రం కాంట్రాక్టు సంస్థ ఉద్యోగులు అకస్మాత్తుగా ఆ దారిని మూసివేశారు. ప్రజలు నడిచి వెళ్లకుండా అడ్డంగా గొయ్యి తవ్వించారు. తూర్పున వలిగొండ క్రాస్‌రోడ్డు, పడమర లక్కారం పీయూపీ వద్ద నుంచి రాకపోకలు సాగించాలంటూ కాంట్రాక్టు సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే కొంత మంది మహిళలు, వృద్ధులు, విద్యార్థులు వాటిని దాటేందుకు యత్నించగా కిందపడిపోయారు.
బీజేపీ నాయకుల రాస్తారోకో
బస్టాండ్ వద్ద తలెత్తిన సమస్య బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి ఆలె చిరంజీవితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంపై కాంట్రాక్టు సంస్థ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులతో కలిసి సర్వీస్ రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ మన్మథ కుమార్ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


