● ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్ : ఫార్మసీ రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం నల్లగొండలోని ఎంజీయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ కోర్సులో చేరిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విషయ పరిజ్ఞానం, ప్రాయోగిక, వృత్తి నైపుణ్యం, పరిశోధనా దృక్పథం పెంపొందించుకున్న విద్యార్థులకు ఫార్మసీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 34 మంది విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ కోర్సులో చేరడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ విభాగాధిపతి జ్యోతి, ఆర్‌ఎస్.అన్నపూర్ణ, వై.ప్రశాంతి, డి.రమేష్, కళ్యాణి, అమరేందర్, జి.ఉపేందర్, హైమావతి, మద్దిలేటి, శంకరాచారి, శ్రీధర్‌రావు, తిరుపతి పాల్గొన్నారు.
క్రీడా పోటీల క్యాలెండర్ ఆవిష్కరణ
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని ఎంజీయూలో గురువారం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంతర్ కళాశాల క్రీడా పోటీల క్యాలెండర్‌ను వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీల క్యాలెండర్ విడుదల చేయడం విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఒక ముందడుగు అన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ పసుపుల మద్దిలేటి, యూనిర్సిటీ సిబ్బంది ఆకుల రవి, శివరాం, శ్రీదేవి, ప్రశాంతిరెడ్డి, ఆర్. మురళి, వై. శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు ఎంపిక
రామన్నపేట : పాండిచ్చేరిలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న 37వ సౌత్‌జోన్ జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీలకు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థిని తోటకూరి శివాని ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాహత్‌ఖానం తెలిపారు. ఆగస్టు 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగిన 12వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో శివాని 1000 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానం సాధించి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. శివానిని గురువారం ప్రిన్సిపాల్, పీడీ ఎం. రవీందర్‌రావు అభినందించారు.
మహిళ ఆత్మహత్య
చిలుకూరు : ఇంట్లో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిలుకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన మంద భాగ్యలక్ష్మి(35)కి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం రాత్రి భర్త, ఇద్దరు పిల్లు ఒక గదిలో నిద్రించగా.. మరో గదిలో నిద్రించిన భాగ్యలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ మోహన్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అప్పల రంగయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


