నల్లగొండ టౌన్ : ఉద్యోగుల హక్కుల సాధనం కోసం ఈ నెల 10న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమంలో పెద్దఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయాలని టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి తదితరులు పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని టీఎన్‌జీఓ భవన్‌లో చలో హైదరాబాద్ కార్యక్రమంపై సూర్యాపేట, నల్లగొండ జిల్లాల టీజేఏసీ ప్రతినిధులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమాలలో అందరూ పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా హక్కులను సాధించుకుందామన్నారు. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్లు చలో హైదరాబాద్ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరినీ తీసుకురావాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ స్కీంను సమదర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్ల మురళి, కన్వీనర్ యాదగిరి, నాయకులు జే. శేఖర్‌రెడ్డి, చేపూరి నర్సింహాచారి, లక్ష్మయ్య, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫ టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
మారం జగదీశ్వర్


