నీటి యాజమాన్యం – తలలు తుంచడం
ఫ కోదాడ ఉద్యానవనశాఖ అధికారి
పూసపాటి అనిత సూచనలు
బాగా విచ్చుకున్న బంతి పూలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయడం మంచిది. పువ్వులు కోసే ముందు నీరు ఇచ్చినట్లయితే పువ్వులు తాజాగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు పూలు కోస్తుంటే దిగుబడి పెరుగుతుంది. కోసిన తరువాత పువ్వులను తడిపిన గోనె లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డతో కప్పి మార్కెట్‌కు తరలించాలి. సాధారణంగా ఆఫ్రికన్ రకాలు ఎకరానికి 4–5 టన్నుల పూల దిగుబడినిస్తాయి.
నడిగూడెం : బంతి పూలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండటంతో సన్న, చిన్నకారు రైతులు బంతి సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో బంతి సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని కోదాడ ఉద్యానవన శాఖ అధికారి పూసపాటి అనిత సూచించారు. రైతులు అనుసరించాల్సిన సాగు విధానం, మెలకువలు ఆమె మాటల్లోనే..
వాతావరణం – నేలలు
వాతావరణ పరిస్థితులను బట్టి బంతిని వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. బంతి 14–28 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద బాగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద మొక్క పెరుగుదల తగ్గి, తక్కువ పరిమాణం గల పువ్వులు ఉత్పత్తి అయ్యి దిగుబడి తగ్గుతుంది. నీడ ప్రదేశాలు బంతి సాగుకు అనుకూలం కావు. దీనివల్ల మొక్కలు శాఖీయ దశలోనే ఉండి పూలు సరిగ్గా పూయవు. బంతి సాగుకు గరప నేలలు అత్యంత అనుకూలమైనవి. బరువైన నేలల్లో కూడా మురుగు నీటి వసతి ఉన్నప్పుడు బంతిని సాగు చేయవచ్చు. ఉదజని సూచిక ( ఞఏ) 7.0–7.5 మధ్య గల నేలలు ఎంతో అనుకూలం.
రకాలు
మన ప్రాంతంలో బంతి సాగు చేసే రైతులు ముఖ్యంగా ఆఫ్రికన్ బంతి రకాలు, ఫ్రెంచి బంతి రకాలు సాగు చేస్తుంటారు. వాణిజ్య పరంగా ఆఫ్రికన్ బంతి రకాలకు మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉంటుంది.
ఆఫ్రికన్ బంతి : ఇవి ఏపుగా, ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్కలు. వీటిలో వివిధ రంగులు గల పెద్ద పూల రకాలున్నాయి. పూసా నారింగ గైండా, పూసా బసంతి గైండా, ఈమధ్య విడుదలైన ఆర్కా బంగార (పసుపు) మరియు ఆర్కా అగ్ని (నారింజ) రకాలు మంచి దిగుబడిని ఇస్తున్నాయి. అయితే ఇవి కాండం కత్తిరింపుల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతాయి. ఈ రకాలలో విత్తనాలు ఉండవు. ఇవి కాక ప్రైవేటు సంస్థలు రూపొందించిన హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్రెంచి బంతి : ఈ రకం మొక్కలు పొట్టిగా, దృఢంగా ఉండి సింగిల్ లేదా డబుల్ పూలను కలిగి ఉంటాయి. ఇవి ఆఫ్రికన్ బంతి రకాలకన్నా త్వరగా కోతకు వస్తాయి.
నాటే సమయం – దూరం
బంతిని అన్ని కాలాల్లో సాగు చేసినప్పటికీ, జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకుంటే అక్టోబర్–ఏప్రిల్ నెలల్లో మార్కెట్‌కు పువ్వులను సరఫరా చేయవచ్చు. ముఖ్యంగా పండుగ సీజన్‌కు పూలు వచ్చేటట్లు నాటుకుంటే రైతులు ఎక్కువ లబ్ది పొందవచ్చు. సాధారణంగా పండుగ రోజుకు 60 రోజులు ముందుగా నాటుకోవాలి. సెప్టెంబర్–అక్టోబర్‌లో నాటుకున్న పంట నుంచి నాణ్యమైన పువ్వులు, విత్తనాలు పొందవచ్చు. ఆఫ్రికన్ రకాలు వరుసకు వరుసకు 60 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 45 సెం.మీ. దూరం ఉండేటట్లు నాటుకోవాలి. ఫ్రెంచి రకాలైతే మొక్కకు మొక్కకు మధ్య 25 సెం.మీ., వరుసకు వరుసకు మధ్య 25 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. 3 లేదా 4 ఆకులు కలిగి 25 రోజుల వయస్సున్న దృఢమైన బంతి నారు నాటడానికి అనుకూలంగా ఉంటుంది. నారు తీయడానికి ఒకరోజు ముందు నారుమడికి నీరు ఇచ్చినట్లయితే మొక్కల వేర్లు దెబ్బతినకుండా ఉంటాయి.
ఎరువుల యాజమాన్యం
ఆఖరి దుక్కిలో ఎకరానికి 8–10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వీటితో పాటు ఎకరానికి 30 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం మరియు 30 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను అందించాలి. అంటే 66 కిలోల యూరియా, 185 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 50 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలి. సిఫారసు చేసిన మోతాదులో సగం నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగతా నత్రజనిని నాటిన 30–40 రోజుల తరువాత పైపాటుగా అందించాలి.
బంతి మొక్కలకు అన్ని దశల్లోనూ సరిపడనంత తేమ భూమిలో ఉండాలి. మొక్క ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే పెరుగుదల మరియు పూత దెబ్బతింటాయి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి తడులు ఇవ్వాలి. ఆఫ్రికన్ బంతి రకాలలో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూ మొగ్గ ఏర్పడుతుంది. ఆ తర్వాతే పక్క కొమ్మలు వస్తాయి. అందువల్ల మొక్కలను నాటిన 40 రోజులకే తలలు త్రుంచినట్లయితే అనేక పక్క కొమ్మలు తొందరగా ఏర్పడి, మొక్క మంచి ఆకారాన్ని సంతరించుకుని ఎక్కువ మోతాదులో ఒకే పరిమాణంలో పూలు వస్తాయి. హైబ్రిడ్ రకాలలో మాత్రం 20 రోజులకే తలలు తుంచాలి.


