ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

దేవరకొండ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన దేవరకొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఎండీ బందగీ(41) కొండమల్లేపల్లిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆర్టిజెన్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా తన విధుల్లో భాగంగా బుధవారం తన ద్విచక్ర వాహనంపై కందుకూరు నుంచి కొండమల్లేపల్లికి వెళ్తుండగా.. దేవరకొండ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి సోదరుడు రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

కొండముచ్చు దాడి..

భార్యాభర్తలకు గాయాలు

ఆత్మకూరు(ఎం) : కొండముచ్చు దాడి చేయడంతో భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లి గ్రామ స్టేజీ వద్ద బుధవారం జరిగింది. మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చెందిన కళ్లెం వెంకన్న, అతడి భార్య సైదమ్మ బుధవారం ఉదయం బైక్‌పై గజ్వేల్‌కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా... ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లి గ్రామ స్టేజీ వద్దకు రాగానే రోడ్డు దాటే క్రమంలో కొండముచ్చు ఒక్కసారిగా బైక్‌పై దాడి చేసింది. దీంతో బైక్‌ అదుపుతప్పడంతో వెంకన్న, సైదమ్మ దంపతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108 అంబులెన్స్‌లో మోత్కూరుకు తరలించారు.

చికిత్స పొందుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

భూదాన్‌పోచంపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన యెల్లంకి గోవిందాచారి, రాజమణి దంపతుల కుమారుడు శివప్రసాద్‌ (24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 21న రాత్రి బైక్‌పై ఇంటికి వస్తుండగా.. పోచంపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో బైక్‌ హ్యాండిల్‌ కడుపులో గుచ్చుకుంది. శివప్రసాద్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

బ్యాంకు రుణం ఎగవేత.. సమన్లు జారీ

భువనగిరిటౌన్‌ : కెనరా బ్యాంకు, భువనగిరి శాఖలో తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో శ్రీమాత మహిళా పొదుపు సంఘం సభ్యులకు హైదరాబాద్‌లోని డెట్స్‌ రికవరీ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ–2) సమన్లు జారీ చేసింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.21,21,906 బకాయి పడ్డారు. బ్యాంకు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఆగస్టు 20న సంఘం సభ్యులకు సమన్లు జారీ చేసింది. 30 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబర్‌ 21న ప్రతివాదులందరూ హైదరాబాద్‌లోని డీఆర్‌టీ రిజిస్ట్రార్‌ ఎదుట స్వయంగా లేదా న్యాయవాది ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement