టెండర్ వేలం ద్వారా..
సాక్షి, యాదాద్రి : ఈ వానాకాలం ధాన్యం మిల్లులకు ఇవ్వకుండా గోదాముల్లో నిల్వ చేయడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్‌కు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాకే తదుపరి చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులతో నిండి ఉన్న గోదాములను గడువులోగా ఖాళీ చేయించి కొత్త ధాన్యంం నిల్వకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అయితే మిల్లుల్లో ధాన్యం నిల్వకు చోటు లేలేదని తాము దించుకోలేమని మిల్లర్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు కొందరు మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని చీకటి బజారుకు తరలిస్తున్నారు.
కలెక్టర్లకు పూర్తి అధికారాలు
ధాన్యం నిల్వకు ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడైనా, ఏ రేటుకై నా గోదాములను అద్దెకు తీసుకునేలా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైస్ మిల్లుల్లోని ప్రైవేట్ గోదాములను సైతం అద్దెకు తీసుకోనున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం మిల్లర్లకు కాకుండా ప్రత్యామ్నాయంగా నిల్వ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే మిల్లుల్లో నిండుగా ధాన్యం ఉండడంతో ప్రైవేట్ గోదాములు, జర్మన్ టెంట్లకింద నిల్వ చేయడానికి పరిశీలిస్తున్నారు. మొత్తంగా మిల్లర్లకు వీలైనంత తక్కువ ధాన్యం ఇచ్చేలా సివిల్ సప్లయ్ శాఖ నిర్ణయించింది.
బాయిల్డ్ రైస్ సేకరణలో జాప్యం
జిల్లాలో బాయిల్డ్ రైస్ తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఎఫ్‌సీఐ కేవలం రారైస్‌ను మాత్రమే తీసుకుంటోంది. దీంతో మిల్లుల్లో ధాన్యం లోడింగ్ ఆలస్యమై రైస్ మిల్లర్లలో ఆందోళన మొదలైంది. ఈ నెలాఖరులోగా ఎఫ్‌సీఐకి రారైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ సీజన్‌లో రా రైస్ మిల్లింగ్ చేయడం వల్ల నూకశాతం పెరిగి నష్టం వస్తుందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. తాము కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఇవ్వగలమని మిల్లర్లు అంటున్నారు. ఇటీవల అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం, నాగిరెడ్డిపల్లి రైల్వే పాయింట్ల వద్ద ఈనెల 24, 25 తేదీల్లో లోడింగ్ ప్రారంభమైంది. నాగిరెడ్డిపల్లి నుంచి రెండు విడతలుగా 2,000 టన్నుల చొప్పున బాయిల్డ్ బియ్యం ర్యాక్ ద్వారా తరలించడంతో ఆయా ప్రదేశాలు ఖాళీ అవుతున్నాయి.
ఈ సీజన్‌లో మిల్లులపై ఆధారపడకుండా కార్యాచరణ
ఫ ప్రస్తుతం గోదాముల్లో ఉన్న ధాన్యం వేలం ద్వారా విక్రయం
ఫ బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ఈ సారి సీఎంఆర్ ధాన్యం
ఫ ప్రత్యామ్నాయంపై ప్రభుత్వ దృష్టి
రాష్ట్రస్థాయిలో గోదాముల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ధాన్యం బహిరంగ వేలానికి నిర్ణయించింది. గోదాముల్లో ఇప్పటికే ఉన్న పత్తి, మక్కల తరలింపు, ప్రత్యామ్నాయ నిల్వ మార్గాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో 7.5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉండగా, రైస్ మిల్లుల్లో మరో 10 లక్షల టన్నులతో కలిపి మొత్తం 17.5 లక్షల టన్నులు ఉంది. ఇందులో మన జిల్లాలో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాముల్లో, 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం ఓపెన్ టెండర్ల ద్వారా వేలంలో విక్రయించి గోదాములను ఖాళీ చేయిస్తోంది. సెప్టెంబర్ ఆఖరి నాటికి నిల్వలను పూర్తిగా ఖాళీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా జిల్లాలో ఉన్న గోదాముల్లో సుమారు 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు నిల్వ చేసే సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
ఈ సీజన్‌లో ధాన్యం వివరాలు
(మెట్రిక్ టన్నుల్లో..)
దిగుబడి అంచనా 4,00,000
కొనుగోలుకు అవకాశం 3,00,000
జిల్లాలో ప్రస్తుత ధాన్యం నిల్వలు
గోదాముల్లో 1,30,000
మిల్లుల్లో 13,000


