డ్యూటీ షిఫ్ట్‌లు పాటించాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

డ్యూటీ షిఫ్ట్‌లు పాటించాల్సిందే..

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విధులు నిర్వహించే హోంగార్డులు డ్యూటీ షిఫ్ట్‌ల సమయాలను కచ్చితంగా పాటించాలని రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, హోంగార్డ్స్‌ ఆర్గనైజేషన్‌, డీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ జిల్లా అధికారులు సర్క్యులర్‌ మెమోను విడుదల చేశారు. ఇటీవల హోంగార్డుల విధుల విషయానికి సంబంధించి ఆలయ ఈఓతో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే గుట్టలో విధులు నిర్వహించే 16 పురుషులు, ఏడుగురు మహిళా హోంగార్డులు మొత్తం 23 మంది సకాలంలో హాజరై 8 గంటల డ్యూటీ సమయాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. డ్యూటీ సమయం పూర్తి కాకముందే విధి ప్రదేశం విడిచి వెళ్లడం, ఆలస్యంగా విధులకు హాజరు కావడం, అనుమతి లేకుండా గైర్హాజరు కావడం, షిఫ్ట్‌ సమయాలను స్వయంగా మార్చుకోవడం పూర్తిగా నిషేధించినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అధికారులు ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో హోమ్‌ గార్డులను విధుల నుంచి తొలగించడంతో పాటు నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

పది రోజుల క్రితమే ఆదేశాలు

పది రోజుల క్రితం హోమ్‌ గార్డులకు ఉదయం 5గంటలకు అభిషేకం సమయం నుంచి విధులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఇంతలోనే సుప్రభాతం సమయం నుంచి విధులకు హోం గార్డులు హాజరు కావాలని సర్క్యులర్‌ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. అయితే హోం గార్డులందరికీ ఐదు షిఫ్ట్‌ల్లో డ్యూటీలు ఉంటాయి. అయితే సుప్రభాతం సమయంలో అంటే వేకువజామున 3గంటలకు విధులకు హాజరు కావాలంటే ఇబ్బందిగా ఉంటుందని మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము వేకువజామున 3గంటలకు విధులకు హాజరు కావాలంటే మధ్య రాత్రి ఇంటి నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇంటి దగ్గర తమకు పిల్లలు ఉంటారని, వారిని పాఠశాలకు పంపించే సమయం సైతం తమకు లేకుండా పోతుందని, దీంతో కుటుంబానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమకు కేటాయించిన సమయాల్లో మార్పులు చేయాలని మహిళా హోంగార్డులు కోరుతున్నారు.

ఫ ‘గుట్ట’ దేవస్థానంలో హోంగార్డులకు సర్క్యులర్‌ జారీ

ఫ 8 గంటల విధులు తప్పనిసరి

ఫ నియమాలు ఉల్లంఘిస్తే డ్యూటీ నుంచి తొలగింపే..

ఫ వేకువజామున 3గంటలకే విధులకు రావాలని ఆదేశాలు

ఫ ఆందోళనలో మహిళా హోంగార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement