97,102 మందికి నోటీసులు..
సర్పంచ్ ఓటు గల్లంతు
సాక్షి, యాదాద్రి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) తుది దశ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో భారీగా తప్పిదాలు దొర్లడంతో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫొటో ఒకరిది.. పేరు మరొకరిదిగా మారడం, దశాబ్దాలుగా ఓటు హక్కు ఉన్నవారిని కూడా నాన్–మ్యాపింగ్ జాబితాలో చేర్చడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి.
క్షేత్రస్థాయిలో తప్పులు ఇవే..
● మోత్కూరు మున్సిపాలిటీ ఆరెగూడెం గ్రామానికి చెందిన బిల్లపాటి మహేందర్ రెడ్డి ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో, చిరునామా (10–20 ఇందిరానగర్ ఎస్సీ కాలనీ) అన్నీ సరిగానే ఉన్నా.. పేరు మాత్రం ‘కృష్ణయ్య మన్నే’ అని తప్పుగా పడింది. తన వివరాలన్నీ సరిగానే ఇచ్చినా పేరు తప్పుగా పడితే ఓటు ఎలా వేయాలని ఆయన ఆవేదన చెందుతున్నాడు.
● ఆలేరు మున్సిపాలిటీ 11వ వార్డు (188 పోలింగ్ కేంద్రం)కు చెందిన తునికి రోశయ్య (82) గత 60 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటేశారు. కానీ, తాజా ప్రక్రియలో 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాలేదంటూ ఆయనను ‘నాన్ మ్యాపింగ్’ జాబితాలో చేర్చి నోటీసు జారీ చేశారు.
● యాదగిరిగుట్ట 6వ వార్డు (144 బూత్)కు చెందిన నక్క మహేష్ ఇటీవల పత్రాలు అందజేసినా ముసాయిదా జాబితాలో పేరు తప్పుగా వచ్చింది. నోటీసు అందుకున్న ఆయన వెంటనే బీఎల్‌ఓకు ఆధార్, బర్త్, కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సరిచేయించుకున్నాడు.
డ్రాఫ్ట్ నోటీసుల పంపిణీ
ముసాయిదా ప్రచురణ తర్వాత నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలను అధికారులు సరిచేస్తున్నారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కేటగిరీలకు సంబంధించిన పేర్లను సభల్లో చదివి వినిపించి, అవసరమైన తొలగింపులు, చేర్పులు చేస్తున్నారు. కొత్తగా వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల కోసం ప్రత్యేక సమీక్ష (హియరింగ్) నిర్వహిస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వద్ద ఉన్న ఆధారాలను బీఎల్‌ఓలకు అందజేస్తే, మ్యాపింగ్ వివరాలను సరిచేస్తారు.
యాదగిరిగుట్టలో 503 మందికి
దక్కని మ్యాపింగ్
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 6వ వార్డు పరిధిలోని 144, 146 బూత్‌లలో 161 మంది ఓటర్ల పేర్లలో వ్యత్యాసం రాగా, ఏకంగా 503 మందికి మ్యాపింగ్ కాలేదు. వీరికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు సరైన పత్రాలు చూపి తిరిగి యాప్‌లో అప్‌లోడ్ చేయించుకుంటున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన 128 మంది ఓట్లను అధికారులు తొలగించారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు వలస ఓటర్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సుమారు 60 మందికి నోటీసులు ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో ఓట్లు తొలగించారు. సరైన రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ధ్రువీకరణ పత్రాలు చూపించిన వారి ఓట్లను యథావిధిగా ఉంచారు.
ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో మొత్తం 97,102 నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 45,602, ఆలేరులో 51,500 నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో నోటీసుల జనరేషన్ ఆలస్యం అవుతుండటంతో ఇప్పటివరకు కేవలం వెయ్యి మందికి మాత్రమే అందజేశారు. మిగతావి త్వరలో ఇవ్వనున్నారు.
ఫ ఫొటో ఒకరిది.. పేరు మరొకరిది
ఫ దశాబ్దాలుగా ఓటు హక్కు ఉన్నవారు కూడా నాన్–మ్యాపింగ్ జాబితాలోకి
ఫ పక్క గ్రామానికి మారిన సర్పంచ్ ఓటు
ఫ సవరణ కోసం నోటీసులు జారీ
యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం సర్పంచ్ తుమ్మల జ్యోతి ఓటు ముసాయిదాలో గల్లంతైంది. ఆమె ఓటును పక్కనే ఉన్న లప్పానాయక్ తండా పోలింగ్ బూత్‌లో నమోదు చేశారు. గ్రామ సభలో తన ఓటు కనిపించకపోవడంతో ఆమె అధికారులను నిలదీశారు. జ్యోతి పేరుతో గ్రామంలో పలువురు ఉండటం, రెండు గ్రామాల (లప్పానాయక్ తండా, రాళ్లజనగాం) రెవెన్యూ పరిధి ఒకటే కావడంతో బీఎల్‌ఓ పొరపాటున అక్కడ నమోదు చేశారని, వెంటనే సరిచేస్తామని తహసీల్దార్ గణేష్ నాయక్ తెలిపారు.


