రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం భూసేకరణకు అడుగులు
ఉత్తరభాగంలో భూసేకరణ అవార్డు కేవలం రాయిగిరిలో మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ మొత్తం 100 హెక్టార్ల (సుమారు 250 ఎకరాలు) భూమి సేకరించాల్సి ఉండగా, 30 హెక్టార్లు సేకరించారు. మిగిలిన 70 హెక్టార్ల భూసేకరణను రైతులతో నేరుగా చర్చించి త్వరితగతిన పూర్తి చేయాలని షెడ్యూల్ విధించారు. పరిహారం కోర్టులో డిపాజిట్ చేయడం చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే చూడాలని తీర్మానించారు.
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు.. భూ సేకరణ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌తో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పెండింగ్ అవార్డులు, భూబాధితులకు పరిహారం చెల్లింపులపై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలోని కీలక నిర్ణయాలు..
పరిహారం పెంపు
10 నుంచి 15 ఏళ్లుగా భూముల మార్కెట్ ధరల్లో మార్పులేని ప్రాంతాల్లో బేసిక్ వాల్యూ తక్కువగా ఉంటోంది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ‘అనమలీ కమిటీ’ సిఫార్సుల మేరకు నిర్దిష్ట శాతం ప్రకారం పరిహారం ధరలను పెంచి నోటిఫికేషన్ ఇచ్చేలా ఈ సమావేవంలో అధికారులు వెసులుబాటు కల్పించారు.
పరిహారంలో భారీ వ్యత్యాసం
ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్బిట్రేషన్ డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.తద్వారా భూసేకరణ పరిహారం ఎంత డబ్బు అందిందన్న విషయంలో బాధితులకు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు తుక్కాపూర్ పరిధిలో ఎకరం బేసిక్ వాల్యూ రూ. 7.5 లక్షలు ఉంటే, నిబంధనల ప్రకారం(మూడు రెట్లు వడ్డీలు కలిపి) రూ. 26 లక్షల వరకు పరిహారం లెక్కించారు. అయితే ఆర్బిట్రేటర్లు(మధ్యవర్తులు) రైతుల అభ్యర్థనలను పరిశీలించి ఎర్రబెల్లి గ్రామం వరకు మాత్రం దానిని ఎకరానికి రూ. 50 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతివారం సమీక్ష
భూ సేకరణ చేయడమే కాకుండా, భూమి కోల్పోయిన రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి, ‘భూమిరాశి’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నేరుగా పరిహారం జమ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంతమంది రైతులకు డబ్బులు అందాయనే అంశంపై ప్రతి వారం సమీక్ష నిర్వహించనున్నారు.
కాంట్రాక్టర్‌కు సకాలంలో భూమి అప్పగింత
ఉత్తర భాగం రోడ్డు నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ త్వరలో టెండర్లు పూర్తి చేయనుంది. బిడ్డింగ్ దక్కించుకున్న కాంట్రాక్టర్లకు భూమిని అప్పగించడంలో ఆలస్యమైతే వారు న్యాయపరమైన చిక్కులు సృష్టించి, నష్టపరిహారం కోరే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలోపే వందశాతం భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎ. భాస్కర్‌రావు, టీఎస్ ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ కె. గంగాధర్, ఓఏసీడీ సుందర్‌అబ్నార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వెంకారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ షేఖ్ అహ్మద్, ప్రాజెక్ట్ పీడీ మాధవి, ఆర్డీఓలు క్రిష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌లు జగన్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టరేట్‌లో ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల ప్రత్యేక సమీక్ష
ఫ భూసేకరణ ల్యాప్స్‌పై ఆరా.. పరిహారం పెంపుపై కీలక నిర్ణయాలు
ఫ రాయిగిరిలో పెండింగ్ భూసేకరణపై ప్రత్యేక దృష్టి
ఫ ‘భూమిరాశి’ పోర్టల్ ద్వారా రైతుల ఖాతాల్లోకి పరిహారం


