మోత్కూరు : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పాద యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి.జహంగీర్ తెలిపారు. సోమవారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29, 30, 31 తేదీలలో భువనగిరిలోని డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వరకు పాద యాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. 31న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం బహుళార్థక ప్రాజెక్టులు నిధుల కొరతతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, బునాదిగాని కాల్వల పనులు నిధుల కొరతతో నిలిచి పోయాయని వివరించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల యాదిరెడ్డి, దడిపల్లి ప్రభాకర్, కూరపాటి రాములు, నర్సింహ పాల్గొన్నారు.


