భువనగిరిటౌన్ : జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మాయ కృష్ణ తెలిపారు. సోమవారం భువనగిరిలోని రైతుబజార్‌లో పాదయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. బస్వాపురం ప్రాజెక్టు పనులు చేపట్టి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తికాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, గంధమల్ల, బస్వాపురం ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న భువనగిరి అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర 31న హైదరాబాద్ ఇందిరా పార్క్ చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు, మేడపోయిన సుందర్, సలీం పాల్గొన్నారు.
పాదయాత్ర వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
బొమ్మలరామారం: బొమ్మలరామారం, తుర్కపల్లి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాలకు సాగు, తాగు నీరు అందించాలనే డిమాండ్‌తో చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం కోరారు. ఈమేరకు పాదయాత్ర వాల్‌పోస్టర్‌ను బొమ్మలరామారం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆవిష్కరించారు. ఈ నెల 29న భువనగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించి 31న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ముక్కెర్ల పున్నమ్మ, ముద్దం మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ, హరి ప్రసాద్, అనిల్, బ్రహ్మచారి పాల్గొన్నారు.


