కాలువల్లో చుక్క నీరు లేదు | - | Sakshi
Sakshi News home page

కాలువల్లో చుక్క నీరు లేదు

Aug 24 2026 11:24 AM | Updated on Aug 24 2026 11:24 AM

సాక్షి, యాదాద్రి : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కాలువలు నీరులేక వెలవెలబోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల నిర్వహణ సమస్యల కారణంగా ప్రధాన, పిల్ల కాలువల్లో చుక్క నీరు పారడం లేదు. ఫలితంగా చెరువులు, కుంటలు నిండక, భూగర్భ జలాలు అడుగంటిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఎండిపోయిన 70 చెరువులు

దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నవాబుపేట రిజర్వాయర్‌ నుంచి గుండాల మండలంలోకి సాగునీరు అందాల్సి ఉంది. పైనుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో సుమారు 70 చెరువులు ఎండిపోయాయి. దీంతో దాదాపు 50 వేల ఎకరాల వరి ఆయకట్టు తీవ్ర ప్రభావానికి గురవుతోంది. నీరు రాకపోవడంతో కాలువల్లో పూడిక పేరుకుపోయి, పిచ్చి మొక్కలు మొలిచాయి. నవాబుపేట నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఇప్పటికే ఆందోళనలకు దిగారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ నుంచి బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు రావాల్సిన నీటి విడుదల నిలిచిపోయింది. తుర్కపల్లి, జగదేవ్‌పూర్‌ మండలాల మీదుగా సాగే ఈ కాలువలు ఎండిపోవడంతోపాటు, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి నీరందించే గండి చెరువులోనూ నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. కొండపోచమ్మ కాలువ కింద తుర్కపల్లి, బొమ్మలరామారం, మేడ్చల్‌–మల్కాజిగిరి ప్రాంతాలు కూడా నీరులేక అల్లాడుతున్నాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో పూర్తిగా భూగర్భ జలాలపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. సాగునీటి కాలువల ద్వారా చెరువులు నిండితే బోర్లలో నీటిమట్టాలు పెరుగుతాయని రైతులు ఆశిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాలువలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. వానాకాలం వరి పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వర్షాలు లేక తగ్గిపోతున్న

భూగర్భ జలాలు

నీరు పారక దేవాదుల,

కాళేశ్వరం కాలువలు దయనీయం

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి

నీరందించే గండి చెరువులోనూ

పడిపోయిన నీటిమట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement