రేషన్‌ దొడ్డు బియ్యానికి మోక్షం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దొడ్డు బియ్యానికి మోక్షం

Aug 24 2026 11:24 AM | Updated on Aug 24 2026 11:24 AM

భువనగిరి: జిల్లాలోని రేషన్‌ దుకాణాల్లో 17 నెలలుగా మూలుగుతున్న దొడ్డు బియ్యాన్ని తరలించేందుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వీటిని సేకరించి వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడో, రేపో జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బేసిక్‌ ధరగా కిలోకు రూ. 21.60గా నిర్ణయించారు. అయితే ఆయా రేషన్‌ షాపుల రికార్డుల్లో ఏ మేరకు బియ్యం నిల్వలు నమోదయ్యాయో, అంత మొత్తం వాపస్‌ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు.

773 టన్నుల నిల్వలు..

పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలోని 515 రేషన్‌ దుకాణాల్లో దాదాపు 773 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ పాత నిల్వల వల్ల దుకాణాల్లో స్థలం లేక, కొత్తగా వచ్చే సన్న బియ్యం బస్తాలను అమర్చుకోవడానికి డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాత బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని డీలర్లు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు పౌరసరఫరాల శాఖ స్పందించి వేలానికి ఆదేశాలిచ్చింది.

తరుగుపై డీలర్ల కలవరం

చాలా షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ ఉండి ముక్కిపోవడమే కాకుండా రంగు మారాయి. మరికొన్ని చోట్ల పురుగు పట్టి పిండిగా మారగా, ఎలుకలు, పందికొక్కులు బియ్యం బస్తాలను కొరకడంతో భారీగా తరుగు వచ్చింది. ఇప్పుడు రికార్డుల ప్రకారమే బియ్యం వాపస్‌ ఇవ్వాలని అధికారులు చెప్పడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

ఆదేశాలు వచ్చాయి

రేషన్‌ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 29న వేసిన టెండర్లకు సంబంధించి ఓపెన్‌ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ప్రక్రియ కొనసాగిస్తాం.

– హరికృష్ణ, సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌

వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల

శాఖ ఆదేశాలు

29న టెండర్లు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement