పెద్దవూర : పంటలకు తెగుళ్లు సోకకుండా రైతులు పిచికారీ చేసే పురుగు మందులన్నీ ప్రాణాంతకమైన విష పదార్థాలని, వాటి వాడకంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఎన్. సత్యనారాయణ సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పురుగు మందులు మానవ శరీరంలోకి చేరి ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.
శరీరంలోకి చేరే మార్గాలివే..
చర్మం ద్వారా: పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు శరీరంపై పడితే చర్మం రంధ్రాల ద్వారా లోపలికి చేరుతుంది. ఒంటిపై పుండ్లు, గాయాలు ఉంటే మరింత వేగంగా, సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ముక్కు ద్వారా: మందు పిచికారీ చేసే సమయంలో వెలువడే వాయువులు, ధూళి కణాలను పీల్చడం ద్వారా శ్వాసకోశంలోకి రసాయనాలు చేరుతాయి.
నోటి ద్వారా: పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం వల్ల విషం కడుపులోకి వెళ్తుంది. ఇది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు.
ప్రథమ చికిత్స ఇలా..
నోటి ద్వారా పురుగు మందు కడుపులోకి వెళ్లినట్లు గుర్తిస్తే.. వెంటనే వాంతి చేయించాలి. గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు లేదా ఆవాల పొడి కలిపి తాగించాలి. గొంతులో వేళ్లు పెట్టి కక్కించాలి. కడుపు ఖాళీ అయ్యేలా ఇలా పలుమార్లు చేయాలి. విరుగుడుకు 8 గ్రాముల చార్‌కోల్, 4 గ్రాముల ట్యానిక్ యాసిడ్, 4 గ్రాముల మెగ్నీషియం ఆకై ్సడ్ రసాయనాలను అర గ్లాసు వేడి నీళ్లలో కలిపి తాగించాలి. పాలు, గుడ్డులోని తెల్లసొన లాంటివి ఇస్తే జీర్ణాశయం లోపలి భాగానికి హాని జరగదు. ముక్కు ద్వారా పురుగు మందును పీల్చి శ్వాస తీసుకోవడం కష్టంగా మారితే.. వెంటనే వేరొకరు తమ నోటి ద్వారా బాధితుడి నోట్లోకి గాలిని ఊదుతూ కృత్రిమ శ్వాస అందించాలి. ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
చర్మం, కళ్లలో పడితే..
పురుగు మందు చర్మంపై పడిన వెంటనే సబ్బు, శుభ్రమైన నీటిని ఉపయోగించి పలుమార్లు కడుక్కోవాలి. కళ్లలో పడితే స్వచ్ఛమైన నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. బట్టలపై పడితే ఆ దుస్తులను వెంటనే తీసేసి, ఉతికిన తర్వాతే మళ్లీ ధరించాలి.
పెద్దవూర మండల వ్యవసాయాధికారి
సత్యనారాయణ సూచనలు


