చెక్‌ బౌన్స్‌ కేసులో జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

చెక్‌ బౌన్స్‌ కేసులో జైలుశిక్ష

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

కోదాడరూరల్‌ : చెక్‌ బౌన్స్‌ కేసులో మహిళా ఉపాధ్యాయురాలికి జైలుశిక్ష విధిస్తూ కోదాడ కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె. భవ్య మంగళవారం తీర్పు వెలువరించారు. కోదాడ పట్టణానికి చెందిన ఒక్కవంతుల మట్టపల్లిరావు వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుంకర నాగేంద్రమ్మ 2022లో రూ.13 లక్షలు అప్పుగా తీసుకుంది. షూరిటీగా చెక్కులు ఇవ్వగా వాటిని మట్టపల్లిరావు బ్యాంకు ఖాతాలో వేయగా నగదు లేకపోవడంతో ఆ చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని నాగేంద్రమ్మ తిరిగి మట్టపల్లిరావుకు చెల్లించడంతో పాటు ఆమెకు ఆరునెలల జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. నగదు చెల్లించని పక్షంలో మరో ఆరునెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు.

కేబుల్‌ వైర్ల దొంగల అరెస్టు

చిలుకూరు : వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు సంబంధించిన కేబుల్‌ వైర్లు చోరీ చేస్తున్న దొంగలను చిలుకూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ బండి మోహన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రామిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద విద్యుత్‌ మోటారు కేబుల్‌ వైరు సోమవారం చోరీకి గురి కాగా.. ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిలుకూరు ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోలో ఆపారు. అందులో వెళ్తున్న దండగల సురేష్‌, చింతల గోపమ్మ, సంపంగి గోపిని విచారించగా.. 20 మోటార్ల కేబుల్‌ దొంగతనం చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

కట్టంగూర్‌ : కట్టంగూర్‌ మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటాయని, కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు తెల్ల గడ్డంతో ఉన్నాడని, అతడు ముస్లిం మతానికి చెందిన వ్యక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 87126 70146, 87126 67710, 87126 70179 ఫోన్‌ నంబర్లకు సమాచారం

ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement