మద్దిరాల : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఎస్‌ఐ ఎం. వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం గోరెంట్ల గ్రామానికి చెందిన సత్తూరి రాములు(60) సోమవారం ఏపూరు గ్రామానికి వెళ్లి ఎర్రపహాడ్ ఎక్స్‌రోడ్డు సమీపంలో బస్సు దిగి గోరెంట్ల గ్రామానికి కాలినడకన వస్తున్నాడు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన ధర్మారావు యాదగిరి తన బైక్‌పై సూర్యాపేట నుంచి మద్దిరాల వైపు వెళ్తూ.. రాములును వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య సత్తూరి కళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గీత కార్మికుడికి గాయాలు
నాగారం : తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నాగారం మండలం ఈటూరులో మంగళవారం జరిగింది. ఈటూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు మొగుళ్ల మహేష్‌గౌడ్ రోజుమాదిరిగానే మంగళవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో అతడి కాలు విరడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మిర్యాలగూడ అర్బన్ : ఇంట్లో బోరు మోటారు రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం లావుడితండాలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావుడితండాకు చెందిన లావుడి అశోక్(40) తన ఇంట్లోని బోరు మోటారు రిపేర్‌కు రావడంతో చెక్ చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య విజయ ఉంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ ద్వారా డైమండ్ నేత్ర నిధికి నేత్రాలను దానం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
కోదాడరూరల్ : ఏపీ నుంచి లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కోదాడ రూరల్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. మంగళవారం కోదాడ రూరల్ ఎస్‌ఐ యాకుబ్‌అలీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం లింగాల గ్రామం నుంచి 31 టన్నుల బియ్యంతో ఓ లారీ గుజరాత్‌కు వెళ్తుండగా.. రాష్ట్ర సరిహద్దులోని రామాపురం క్రాస్‌రోడ్‌లో కోదాడ రూరల్ పోలీసులు పట్టుకొని సివిల్ సఫ్లై అధికారులకు అప్పగించారు. వారు మంగళవారం రేషన్ బియ్యమేనని నిర్ధారించడంతో లారీ యజమాని, క్లీనర్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ తెలిపారు.


