పేదల సొంతింటి కల నిజమాయే | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల నిజమాయే

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

భువనగిరిటౌన్‌: భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లు ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోకుండా మూలనపడిపోయాయి. అయితే, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నివాస సముదాయాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేందుకు సర్వం సిద్ధం చేసింది.

ఇళ్లకు మరమ్మతులు చేసి..

సింగన్నగూడెం వద్ద బీఆర్‌ఎస్‌ హయాంలో 444 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించింది. అప్పట్లో అర్హులనుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక కూడా చేశారు. కానీ వాటిలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో గృహ ప్రవేశాలు చేయడంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇళ్లన్నీ నిరుపయోగంగా మారాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇళ్ల పంపిణీలోజాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఇళ్లకు మరమ్మతులు పనులు చేపట్టారు.

పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో అధికారులు అన్ని మౌలిక వసతులను పూర్తి చేశారు. విద్యుత్‌ సరఫరా, తాగునీటి కోసం సంపుల నిర్మాణం, డెయినేజీలు తదితర పనులు పూర్తయ్యాయి. భవనాలకు రంగులు వేయడంతో పాటు, ప్రతీ ఇంటికి విద్యుత్‌ మీటర్‌ సైతం బిగించారు. అయితే, ఇళ్లలో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను మాత్రం లబ్ధిదారులే స్వయంగా చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 444 ఇళ్లు ఉండగా, మొదటి విడతగా 10 బ్లాకులకు చెందిన 162 ఇళ్లను సిద్ధం చేశారు. మిగిలిన 282 ఇళ్లకు మరమ్మతు పనులు చేపట్టి తదుపరి విడతల్లో పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతంలో కేటాయించిన జాబితా నుంచి 360 డిగ్రీల సర్వే ఆధారంగా 59 మంది అనర్హుల పేర్లను తొలగించారు. మిగిలిన దరఖాస్తులు, వస్తున్న ఫిర్యాదులపై విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ప్రారంభోత్సవం చేసి అర్హులకు ఇళ్ల తాళాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ సింగన్నగూడెంలో ప్రారంభానికి సిద్ధమైన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ఫ బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మాణం.. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు

ఫ తొలి విడతగా 10 బ్లాకుల్లో 162 ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం

ఫ 59 మంది అనర్హుల ఏరివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement