ఎడమ కాల్వకు నిలిచిపోయిన మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

ఎడమ కాల్వకు నిలిచిపోయిన మరమ్మతులు

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

నిడమనూరు : నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ మరమ్మతు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గత నెలన్నర పాటు సాగిన పనులు.. ఇటీవల ప్రధాన కాల్వకు నీటిని వదలడంతో కూలీలు, కొన్ని యంత్రాలు వెళ్లిపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ముకుందాపురం వద్ద 37.5 కిలోమీటరు నుంచి సాగర్‌ కాల్వకు కుడి, ఎడమ వైపున పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ వరకు పలు చోట్ల 2 కిలోమీటర్లకు పైగా సీసీ లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే ముప్పారం, వేంపాడు, వెంగన్నగూడెం మేజర్‌ వద్ద పలుచోట్ల కాల్వ మరమ్మతులు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం పనులు సాగడం లేదు. ఇరువైపులా కిలోమీటరుకు పైగా పాత నాప బండల లైనింగ్‌ తీసివేసి మట్టి పోసి లైనింగ్‌కు సిద్ధం చేసి వదిలేశారు. సాగర్‌ ఎడమకాల్వ సీసీ లైనింగ్‌ పనుల్లో 6 టీమ్‌లు పనిచేయగా.. ఒక్కో టీమ్‌ రోజుకు 40 మీటర్ల సీసీ లైనింగ్‌ చేసేది. కానీ ఇప్పుడు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు గుర్తించి స్థానిక ఎన్‌ఎస్‌పీ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇటీవల కేవలం ఒక్క టీమ్‌తో నామమాత్రంగా పనులు చేస్తున్నారు.

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం..

గత నెలలో తాగునీటి అవసరాల కోసం వారం రోజుల పాటు సాగర్‌ ప్రధాన కాల్వకు నీరు విడుదల చేశారు. నీటి విడుదల సమయంలో పనులు లేక ఖాళీగా ఉన్న కూలీలు.. ఆ వారం రోజులకు కొంతైనా డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు కాంట్రాక్టర్‌ నిరాకరించడంతో కూలీలు, యంత్రాలతో సహా వెళ్లిపోయినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు పనులు చేయాలని ఒత్తిడి చేసినా.. ‘నాకు ఇంకా 16 నెలల గడువు ఉంది’ అని కాంట్రాక్టర్‌ సమాధానం చెబుతుండటంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సాగునీరు ఉండదులే అన్న నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్‌ పనులను గాలికొదిలేశారని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా నారెళ్లగూడెం, ముదిమాణిక్యం మేజర్ల వద్ద మరమ్మతుల కోసం కాల్వ కూల్చివేతలు చేపట్టి పనులు నిలిపివేయడం గమనార్హం.

పనులు పూర్తయ్యేనా..?

ఇటీవల శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో.. కొంత ఆలస్యంగానైనా వానాకాలం సాగు చేసుకోవచ్చని రైతులు అనుకున్నారు. కానీ ఎడమకాల్వ మరమ్మతు పనులు అడ్డంకిగా మారనున్నాయి. మరో నెల రోజులకై నా వానాకాలం సాగుకు సాగర్‌ ఎడమకాల్వకు నీరు విడుదల చేసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. అంతేగాకుండా ఇప్పటికే ఆయకట్టులో పలుచోట్ల వరినాట్లు వేశారు. దీంతో అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఇటీవల కాల్వకు నీటిని

వదలడంతో నిలిచిన పనులు

పనులు లేక వెళ్లిపోయిన కూలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement