లాక్రోస్‌లో సత్తా చాటుతున్న సంగీత | - | Sakshi
Sakshi News home page

లాక్రోస్‌లో సత్తా చాటుతున్న సంగీత

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

చిట్యాల : చిన్ననాటి నుంచే క్రీడలపై ఉన్న ఆసక్తితో లాక్రోస్‌ క్రీడలో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎదిగింది చిట్యాల మున్సిపాలిటీకి చెందిన చిర్రబోయిన సంగీత. అంతర్జాతీయ వేదికపై భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరగనున్న శ్రీసౌత్‌ ఈస్ట్‌ ఆసియా కప్‌–2026శ్రీ పోటీల్లో పాల్గొననున్న భారత లాక్రోస్‌ క్రీడా జట్టుకు ఆమె ఎంపికై ంది. ఈ మేరకు లాక్రోస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

గురుకులంలో రాటుదేలి..

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు (వెంకటాపురం)కు చెందిన చిర్రబోయిన నర్సింహ–మహేశ్వరి దంపతుల కుమార్తె సంగీత ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాలలోని లోయోలా స్కూల్‌లో చదువుకుంది. అనంతరం ఐదో తరగతిలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బీసీ గురుకులంలో చేరింది. ప్రస్తుతం ఆమె అక్కడే ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు క్రీడలపై ఉన్న మక్కువతో లాక్రోస్‌ ఆటపై సంగీత ప్రత్యేక దృష్టి సారించింది. క్రమం తప్పకుండా సాధన చేస్తూ రాష్ట్ర, దక్షిణ భారత స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలను అందించింది.

స్వర్ణ పతకాలతో సత్తా..

జూలై చివరి వారంలో జరిగిన దక్షిణ భారతదేశ మండల లాక్రోస్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌–2026లో తెలంగాణ స్టేట్‌ సీనియర్‌ గరల్స్‌ జట్టుకు సంగీత ప్రాతినిధ్యం వహించి విశేష ప్రతిభ కనబరిచింది. ఆమె ఆటతీరుతో తెలంగాణ జట్టుకు స్వర్ణ పతకం వరించింది. అలాగే గతంలో ఏపీలోని కర్నూలు, చైన్నెలలో జరిగిన సౌత్‌ జోన్‌ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని బంగారు పతకాలను సాధించిన జట్టులోనూ ఆమె కీలక సభ్యురాలిగా ఉంది. వరుస పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే భారత లాక్రోస్‌ జట్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.

భారత జట్టులో చోటు సంపాదించిన చిట్యాలకు చెందిన గురుకుల విద్యార్థిని

ఈ నెల 28 నుంచి మలేషియాలో జరగనున్న సౌత్‌ ఈస్ట్‌ ఆసియా లాక్రోస్‌ కప్‌–2026లో దేశం తరఫున బరిలోకి..

ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్న చిట్యాల వాసులు

అభినందనల వెల్లువ..

సంగీతను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు, కమిషనర్‌ బాల మాయదేవి తదితరులు అభినందించారు. కాగా.. సంగీత నిరుపేద కుటుంబానికి చెందినది కావడంతో.. దాతలు, ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తే దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే అవకాశం ఉందని స్థానికులు, క్రీడాభిమానులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement