మిర్యాలగూడ : ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే.. మరోవైపు ప్రతి ఇంట్లో అత్యంత అవసరమైన బియ్యం ధరలు అదుపుతప్పి పరుగులు పెడుతున్నాయి. సన్న బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. గత కొంతకాలంగా మార్కెట్‌లో నిలకడ లేకుండా పెరుగుతున్న ఈ ధరలు సోమవారం నాటికి మరింత గరిష్ట స్థాయికి చేరుకోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బస్తా రూ.1,900.. కిలో రూ.85
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన పాత సన్న బియ్యం (బీపీటీ, జేఎస్‌ఆర్, హెచ్‌ఎంటీ తదితర రకాలు) 25 కిలోల బస్తా ధర రూ.1,750 నుంచి రూ.1,900 వరకు పలుకుతోంది. కొన్ని బ్రాండెడ్ రకాలు, సూపర్ ఫైన్ క్వాలిటీ సన్న బియ్యాన్ని కిలో రూ.80 నుంచి రూ.85 చొప్పున విక్రయిస్తున్నారు. పాత బియ్యం క్వింటాల్ ధర రూ.7000 నుంచి రూ.7,600 దాటిపోయింది. కొత్త బియ్యం క్వింటాల్ సైతం రూ.6,200కు పైమాటే ఉంది. ప్రతి నెలా క్వింటాల్‌పై సగటున రూ.200 నుంచి రూ.400 వరకు పెరుగుతుండటంతో.. సామాన్యులు సతమతమవుతున్నారు.
దిగుబడి తగ్గడం.. దళారుల దందా..
వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా బేసిన్‌తో పాటు అనేక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు ధాన్యం దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో సన్న ధాన్యానికి తీవ్ర కొరత ఏర్పడింది. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, ఇదే అదనుగా భావించిన కొందరు రైస్ మిల్లర్లు, దళారులు క్షేత్రస్థాయిలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు చేసిన ధర కంటే కిలోపై అదనంగా రూ.5 నుంచి రూ.10 వరకు పెంచి విక్రయిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున బియ్యాన్ని ఎగుమతి చేయడం కూడా స్థానిక మార్కెట్‌లో ధరల మంటకు మరో కారణమని తెలుస్తోంది.
నియంత్రణ ఏదీ?
పెరిగిన ధరల వల్ల కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక పేద, మధ్య తరగతి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి రైస్ మిల్లులు, హోల్‌సేల్ షాపుల్లో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇష్టారాజ్యంగా జరుగుతున్న అక్రమ నిల్వలను అరికట్టి, బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో పెరిగిన
సన్న బియ్యం రేట్లు
సూపర్ ఫైన్ సన్న బియ్యం
కిలో రూ.80 పైమాటే
సామాన్యులకు తప్పని తిప్పలు


