చిట్యాల : రోడ్డుపై దొరికిన నగదును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకుంది ఓ యువతి. చిట్యాల మున్సిపాలిటీలోని వనిపాకల రోడ్డులో ఈ నెల 2న ఇమ్మడి లక్ష్మీప్రసన్నకు రూ.36వేల నగదు దొరికింది. నగదు పోగొట్టుకున్న వారి గురించి ఆరా తీయగా.. ఎలాంటి వివరాలు తెలియరాలేదు. దీంతో దొరికిన నగదును లక్ష్మీప్రసన్న సోదరుడు శివప్రసాద్ సోమవారం చిట్యాల పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు. నిజాయితీ చాటుకున్న లక్ష్మీప్రసన్న, ఆమె సోదరుడిని పోలీసులు అభినందించారు.
కల్వర్టును ఢీకొని
కారు దగ్ధం
నూతనకల్ : ప్రమాదవశాత్తు కల్వర్టు ఢీకొని కారు దగ్ధమైంది. ఈ ఘటన నూతనకల్ మండలం ఎర్రపహాడ్ క్రాస్ రోడ్డు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం బక్కహేమ్లాతండాకు చెందిన కేతావత్ పవన్, సపావత్ మహేష్ హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా.. 365వ నంబర్ జాతీయ రహదారిపై ఎర్రపహాడ్ క్రాస్ రోడ్డు సమీపంలో అడవి పంది అడ్డువచ్చింది. దానిని తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో అకస్మత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కారులోని వ్యక్తులు వెంటనే అప్రమత్తమై బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు మంటల్లో కాలిబూడిదైంది. కాగా.. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్య
నిడమనూరు : కుటుంబ సమస్యలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిడమనూరు మండలం మార్తువారిగూడెంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్తువారిగూడెం గ్రామానికి చెందిన మేకల మైసమ్మ(52)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలయ్యాయి. మైసమ్మ భర్త గతంలోనే మృతిచెందాడు. కాగా.. పలు కారణాలతో గతేడాది నుంచి మైసమ్మ కోడలు కుమారుడికి దూరంగా ఉంటుంది. దీంతో కొడుకు సంసారం దెబ్బతిన్నదని మనస్తాపానికి గురైన మైసమ్మ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం మైసమ్మ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి తిరుమలగిరి(సాగర్) మండలం రాజవరం గ్రామంలో ఉంటున్న ఆమె చిన్న అల్లుడు పోలేపల్లి సోమరాజుకు సమాచారం అందించారు. అతడు వచ్చి చూసేసరికి మైసమ్మ ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి చిన్న అల్లుడు సోమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.


