నాగార్జునసాగర్ : రాష్ట్రంలోని 6,700 మంది ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించి, పేస్కేల్ వర్తింపజేయాలని అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం నాగార్జునసాగర్‌లో వరుణ యాగానికి హాజరైన సీఎంను తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నావజల ప్రసాద్‌శర్మ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పైడిమర్రి ప్రసాద్‌శర్మ తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు.
‘స్కీం’ పరిధి నుంచి తొలగించాలి
గ్రామీణ ప్రాంతాల్లో ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్న అర్చకులను ‘స్కీమ్’ పరిధి నుంచి తొలగించి దేవాదాయశాఖ చట్టంలోని సెక్షన్ 43 ప్రకారం గుర్తించాలని కోరారు. ప్రతి మండలానికి అర్చకులను గుర్తించి ఎగ్జిక్యూటి వ్‌ఆఫీసర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
పే స్కేల్ అమలు చేయాలి
ప్రస్తుతం దేవాదాయశాఖ వివిధ దేవాలయాల నుంచి 22శాతం కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తోందని, దానిని 25 శాతానికి పెంచి అర్చకులకు 99వ పీఆర్సీ ప్రకారం పే స్కేల్ వర్తింపజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.10వేల గౌరవ వేతనం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను పిలిచి ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి వెంగలం సంతోష్‌శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
సీఎంకి అర్చక ఉద్యోగ జేఏసీ వినతి


