అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 టన్నుల సండ్ర కలప(మొద్దులు)ను అటవీ అధికారులు సీజ్ చేశారు. తిమ్మాపురం గ్రామ శివారులో కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి వెంట ఓ వ్యవసాయ క్షేత్రం సమీపంలో కలప నిల్వ ఉన్నట్లు అటవీ అధికారులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు అందింది. దీంతో సూర్యాపేట జిల్లా అటవీ శాఖ రేంజర్ కిరణ్‌కుమార్ ఆదేశాల మేరకు నాగారం, సూర్యాపేట సెక్షన్ అధికారులు ఎస్. వెంకటేశ్వర్లు, ఎ. మంజులతో పాటు సిబ్బంది రాత్రంతా గాలించారు. ఓ బొలేరో వాహనం కలప లోడ్‌తో వెళ్తుండగా అటవీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. అందులోని కలపను సీజ్ చేశారు. సమీప ప్రాంతంలో తనిఖీ చేయగా సుమారు 20 టన్నుల నిల్వ చేసిన కలపను గుర్తించారు. సోమవారం ఆ కలపను ట్రాక్టర్లలో జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. సీజ్ చేసిన కలప విలువ రూ.15లక్షలకు పైగానే విలువ ఉంటుందని సమాచారం. బొలేరో డ్రైవర్ పరారీలో ఉన్నాడని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి కలప నిల్వ చేసిన వారిని గుర్తిస్తామని అటవీ శాఖ సెక్షన్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎఫ్‌బీఓలు ఆర్. అనిల్, వెంకన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


