నార్కట్‌పల్లి : గుర్తుతెలి యని వాహనాన్ని ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నానికి చెందిన వడ్లపాటి శాంతిస్వరూప్(26) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సర్వి కర్రల లోడ్‌తో పత్తిపాడు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఆదివారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి శివారులోని ఓల్డ్ వివేరా హోటల్ సమీపంలోకి రాగానే డీసీఎం అదుపుతప్పి ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాంతిస్వరూప్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శాంతిస్వరూప్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్‌పలి్‌ల్ ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి దుర్మరణం
● న్యాయం చేయాలని దేవరకొండ డిపో ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
చందంపేట : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చందంపేట మండలం సర్కిల్‌తండా సమీపంలో జరిగింది. చందంపేట మండలం పొగిళ్ల గ్రామానికి చెందిన వాయిలపల్లి వజ్రమ్మ, ఈదయ్య దంపతుల కుమారుడు వాయిలపల్లి శ్రీను(38) పని నిమిత్తం బైక్‌పై కొండమల్లేపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో సర్కిల్‌తండా సమీపంలోని తెల్లపలుగు గుట్ట వద్దకు రాగానే ఆర్టీసీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు దేవరకొండ డిపో ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. చందంపేట ఎస్‌ఐ లోకేష్ అక్కడికి చేరుకొని మృతుడి బంధువులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
చౌటుప్పల్ : మండల పరిధిలోని తూప్రాన్‌పేట గ్రామ శివారులో లక్ష్మి దుర్గ దాబా హోటల్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి విజయవాడ మార్గంలో ఉన్న దాబా వద్ద నుంచి హైదరాబాద్ వైపునకు రోడ్డు దాటుతుండగా డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు గులాబీ రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించాడు. కుడిచేతిపై అమ్మ అని పచ్చబొట్టు ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి. మన్మథకుమార్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 62744 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.


