నకిరేకల్ : మద్యం మత్తులో ఎలుక మందు తాగి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్య(80) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగిన సమయంలో తాను చనిపోతానని పలుమార్లు కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉండేవాడు. శనివారం మద్యాహ్నం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న ఎలుక మందును నీటిలో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటి తర్వాత లింగయ్య వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు.
చిరుత కలకలం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ సమీపంలో శనివారం చిరుత సంచరించినట్లు వార్తలు రావడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఆదివారం డంపింగ్ యార్డు దగ్గరలోని సీతాఫల చెరువు సమీపంలో బుడిగ మల్లయ్య వ్యవసాయ భూమిలో చిరుత పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. గేదెలు కాసేందుకు వెళ్లిన యువకుడు పాదముద్రలను గుర్తించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు పాదముద్రలను ఫొటో తీసి అటవీ అధికారులకు పంపించారు. అయితే ఆ పాదముద్రలు అడవి కుక్కల పాదముద్రలని అటవీ అధికారులు తెలిపినట్లు సమాచారం.
ముగిసిన మల్లఖంబ్
శిక్షణ శిబిరం
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన మల్లఖంబ్ క్రీడ రెండు రోజుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 42మంది శిక్షకులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ చాంబర్స్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్‌రెడ్డి రాజు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. అతి ప్రాచీనమైన మల్లఖంబ్ క్రీడను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మల్లఖంబ్ క్రీడలో విద్యార్థులు పాల్గొనేలా సర్టిఫికెట్లు పొందిన శిక్షకులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లఖంబ్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ పాటర్న్ కేవీబీ. కృష్ణారావు, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉజ్జిని మంజుల, కోశాధికారి పోలె అంజయ్య, కార్యదర్శి గోపాల్, శిక్షకులు కిరణ్, వెంకట్, కృష్ణమూర్తి, నరేష్, సందీప్, స్వాతి, స్వరూప, సుమతి, అరుణ, నందిని, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


