రామగిరి (నల్లగొండ) : పోరాటాల గడ్డ అయిన నల్లగొండ జిల్లాలో బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించేవరకు పోరాటాలు కొనసాగుతాయని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం(బీసీఐఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జీఎల్ గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో ఉమ్మడి జిల్లా బీసీఐఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల హక్కుల సాధన సామాజిక న్యాయ పోరాట సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 56 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో ఇప్పటివరకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, చట్టసభలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టంతో పాటు బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లలో బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించడానికి స్వతంత్ర కమిషన్ వేయాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యమాలు మరింత బలపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విఠల్, చెరకు సుధాకర్, బీసీఐఎఫ్ జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్, గుండెబోయిన జానయ్యయాదవ్, ఆమంచి అంజయ్య, సుంకరి భిక్షంగౌడ్, చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల యాదగిరి, చెన్న శ్రీకాంత్, రావిరాల నర్సయ్య, ఎంఏ. కరీం, కొన్నె శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్,
బీసీఐఎఫ్ రాష్ట్ర చైర్మన్ చిరంజీవులు


