సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణపై వరుణుడు కరుణ చూపాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సోమవారం నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ ప్రాంగణంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మహా వరుణయాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షితో మాట్లాడారు. రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాల జీవనోపాధి వ్యవసాయం పైనే ఆధారపడి ఉందని, వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండితే రైతులతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ ఏడాది వానాకాలంలో వర్షాల మధ్య విరామాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని, ఒకేసారి భారీ వర్షాలు కురవడం కంటే పంట కాలమంతా అవసరమైన సమయంలో, అవసరమైన మేరకు వర్షాలు కురవడం ముఖ్యమన్నారు. అప్పుడే పంటలు ఆరోగ్యంగా పెరగడంతో పాటు చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.
రైతుల ప్రయోజనాలే ముఖ్యం
కొన్ని సందర్భాల్లో ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉండటంతో వర్షపాతంలో లోటు ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి టీఎంసీ నీటిని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వినియోగిస్తున్నామని తెలిపారు. వానాకాలం పంటలను కాపాడటం, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి జలాశయాల్లోకి వచ్చే నీటి ప్రవాహాలను పర్యవేక్షిస్తున్నామన్నారు.
అందుకోసమే నేడు సాగర్‌లో
మహా వరుణ యాగం
నీటిపాదరుల శాఖ మంత్రి
ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


