ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీకాలం 2027 మార్చి 9తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయ కసరత్తు మాత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ స్థానంలో బీసీ వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తుండగా వచ్చే ఎన్నికల్లోనూ అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపితే రాజకీయంగా లాభం ఉంటుందనే అభిప్రాయం ప్రధాన పార్టీల్లో వ్యక్తమవుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో బీసీ పట్టభద్రుల ఓటర్ల ప్రభావం, సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జనరల్ అభ్యర్థులను కూడా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అభిప్రాయాలు సేకరిస్తున్న కాంగ్రెస్
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆశావహుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. మూడు జిల్లాల్లో పార్టీ బలోపేతం, పట్టభద్రులలో గుర్తింపు, ప్రజా ఉద్యమాల్లో చురుకై న పాత్ర, సామాజిక సమీకరణలు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థిని ఖరారు చేసే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో వంశీచంద్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ – ఖమ్మం – నల్లగొండ స్థానంలో బీసీవైపు మొగ్గు చూసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో బీఆర్‌ఎస్ స్థానం
బీఆర్‌ఎస్ కూడా గత ఎన్నికల అనుభవాలను విశ్లేషిస్తూ గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. పట్టభద్రులతో అనుబంధం ఉన్న నాయకులు, విద్యావేత్తలు, సామాజికంగా గుర్తింపు పొందిన వ్యక్తుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తీన్మార్ మల్లన్న కంటే ముందు ఇది బీఆర్‌ఎస్ స్థానం. కాబట్టి దానికి పక్కాగా దక్కించుకోవాలంటే మరింత బలమైన వ్యక్తిని బరిలో నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీ వాదంపై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉన్నందున అభ్యర్థి ఎంపికపై ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వ్యూహరచనలో బీజేపీ
బీజేపీ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందస్తు వ్యూహరచనలో నిమగ్నమైంది. పట్టభద్రుల ఓటర్లలో పార్టీ ప్రభావాన్ని మరింత పెంచేలా అభ్యర్థి ఎంపిక ఉండేలా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎమ్మెల్సీ అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీలు
ఫ బీసీలకే టికెట్ ఇచ్చే యోచన
ఫ నెలాఖరులో అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం
ఫ ఎవరిని నిలబెట్టాలని కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ
మూడు ప్రధాన పార్టీల్లోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నా.. బీసీ ఓటర్లతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతును కూడగట్టగల అభ్యర్థికే ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు, జాబితాల రూపకల్పన చేపట్టనుంది.


