సాక్షి, యాదాద్రి: రెండున్నర దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న ‘బునాదిగాని కాలువ’ ఆధునీకరణ పనుల్లో ప్రజాధనం, రైతు భూములు వృథా కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును తక్కువ వ్యయంతో, శాసీ్త్రయంగా పూర్తి చేయడానికి రీడిజైన్ చర్యలు చేపట్టింది. భూసేకరణ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, అందుబాటులో ఉన్న భూమి పరిధిలోనే పనులు పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
అత్యధికంగా భూసేకరణ చేశారని విమర్శలు
గతంలో కాల్వకు తీసిన మట్టిదిబ్బలు (స్పోయిల్ బ్యాంక్), సర్వీస్ రోడ్ల పేరుతో అత్యధికంగా భూసేకరణ చేశారని విమర్శలు ఉన్నాయి. దాదాపు 20 మీటర్లు (70ఫీట్లు) కేవలం స్పోయిల్ బ్యాంక్ కోసమే కేటాయించడంతో బీబీనగర్ మండలంలోని రైతులు విలువైన భూములు కోల్పోవాల్సి వచ్చింది. గతంలో 40 మీటర్ల వెడల్పు సరిపోయే చోట ఏకంగా 80 మీటర్ల వరకు కెనాల్‌ను పెంచి భూసేకరణ చేపట్టారు. తీసిన మట్టి ప్రస్తుతం ఎక్కడా లేకపోగా, అదనపు భూసేకరణ కారణంతో పనులను ఏళ్లుగా వాయిదా వేస్తూ వచ్చారు.
సగానికి పైగా తగ్గనున్న బడ్జెట్
అనవసరమైన మట్టిదిబ్బల కేటాయింపులను రద్దు చేసి, కాలువ పరిధిలోని భూమిలోనే పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టు వ్యయం సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది. గతంలో రూ.100 కోట్లుగా అంచనా వేసిన బడ్జెట్, పరిమిత భూసేకరణతో రూ.40 కోట్ల లోపే పూర్తవుతుందని అంచనా. మొత్తం 752 ఎకరాల సేకరించే ప్రక్రియలో 435 ఎకరాలు అవార్డు కాగా.. ఇంకా అవసరమని చెబుతున్న 317 ఎకరాల భూసేకరణను రద్దు చేస్తే, వివాదాలు తగ్గి పనులు వేగవంతం కానున్నాయి.
10 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం
కాలువ రూపురేఖలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 10 రోజుల్లో డీపీఆర్ నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్, ఈఎన్సీలతో 15 రోజుల్లో మరోసారి సమీక్షించనున్నారు.
బునాదిగాని కాలువ
ఫ బునాదిగాని కాలువ సమస్యకు శాసీ్త్రయ పరిష్కారం
ఫ రూ.100 కోట్ల అంచనా వ్యయం రూ.40 కోట్లకు కుదింపు
ఫ అందుబాటులో ఉన్న భూమి పరిధిలో పనులు పూర్తిచేయాలని స్పష్టం చేసిన ఎమ్మెల్యే


