భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైనప్పటికీ క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్య ఏమాత్రం తగ్గడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న వ్యాపారులకే బెదిరింపులు
మున్సిపల్ నిబంధనల ప్రకారం తోపుడు బండ్ల వ్యాపారులు ఒకేచోట శాశ్వతంగా కాకుండా సంచరిస్తూ విక్రయాలు జరుపుకునే వెసులుబాటు ఉంది. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం తోపుడు బండ్ల వ్యాపారులపైనే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. వ్యాపారులను అక్కడికక్కడ బెదిరించి పంపిస్తున్న పోలీసులు.. రోడ్లను ఆక్రమించి వ్యాపారం కొనసాగిస్తున్న దుకాణదారులు, ఇతర ఆక్రమణదారులను మాత్రం కనీసం హెచ్చరిస్తున్న పాపానపోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా వద్ద తోపుడు బండ్లు పెడుతున్న చిన్న వ్యాపారులను మాత్రం పోలీసులు అక్కడ పెట్టనివ్వడం లేదు. సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారుల పక్కన, జిమ్‌లు, వ్యాపార సముదాయాల ముందు గంటల తరబడి కార్లు, బైక్‌లను దర్జాగా పార్కింగ్ చేసి అర్ధరాత్రి వరకు ఉంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో నిత్యం ఇబ్బందులే..
ఉడిపి హోటల్ నుంచి రియాల్స్ మార్ట్, బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా నుంచి కుమ్మరివాడ వెళ్లే గల్లీ, జగదేవ్‌పూర్ చౌరస్తా, నల్లగొండ రోడ్డు, వినాయ చౌరస్తాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటోంది. ఇరువైపులా రోడ్లపైనే విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు, కార్లు నిలుపుతుండటంతో రాకపోకలు సాగించే ఇతర వాహనాలు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణంలో సరిపడా పార్కింగ్ స్థలాలు లేకపోవడం, ఉన్న స్థలాలు ఆక్రమణకు గురికావడం.. ఫుట్‌పాత్‌లు కూడా లేక బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఫ రోడ్లపైనే వాహనాల పార్కింగ్
ఫ ఇబ్బందుల్లో వాహనదారులు
ఫ తోపుడు బండ్ల వ్యాపారులపైనే పోలీసుల ప్రతాపం


