మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పనకబండ చౌరస్తా నుంచి రాజన్నగూడెం వరకు బీటీరోడ్డు నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. మూడేళ్ల క్రితం రూ.5.80 కోట్లతో చేపట్టిన మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు అర్ధాంతరంగా వదిలేశారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని గత నెల 24న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. అయితే అప్పటికీ పనుల్లో కదలిక లేకపోవడంతో ‘మంత్రి ఆదేశించినా పనులు మొదలు కాలే’ అనే శీర్షికన ఈ నెల 6న సాక్షి దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం జేసీబీతో పాత రోడ్డును పెకిలించి మట్టి పోసి రోలింగ్ చేస్తున్నారు. ఈపనులను ఎమ్మెల్యే మందుల సామేల్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అవిశెట్టి అవిలుమల్లు, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మినర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, పోచం జగన్, సింగిల్‌విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వంగరి రాములు, పట్టణ కాంగ్రెస్ నాయకులు గనగాని నర్సింహ్మ, పల్లపు సమ్మయ్య, గొలుసుల దుర్గయ్య తదితరులున్నారు.


