ఫ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఫ తొమ్మిది రోజుల పాటు యువతుల ఉపవాస దీక్షలు
ఫ పాడిపంటలు సమృద్ధిగా పండాలని, మంచి భర్త రావాలని పూజలు
బొమ్మలరామారం : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే ముఖ్యమైన పండుగల్లో ‘తీజ్’ ఒకటి. పెళ్లికాని యువతులు ప్రకృతిని ఆరాధించే ఈ పండుగతో తండాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమకు మంచి భర్త లభించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో గిరిజనులు ఏటా ఈ తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. గిరిజన తండాల్లో తీజ్ పండుగకు అంతే విశిష్టత ఉంది. అందుకే దీనిని ‘బంజారాల బతుకమ్మ’ అని కూడా పిలుస్తారు.
దాటుడు పండుగతో అంకురార్పణ..
తండాల్లో నిర్వహించే తీజ్ పండుగకు గిరిజనులు దాటుడు (శీత్లా భవాని) పండుగతో అంకురార్పణ చేస్తారు. ఆషాఢ మాసంలో తొలకరి విత్తనాలు వేసిన తర్వాత వచ్చే మంగళవారం రోజున దాటుడు పండుగ జరుపుకుంటారు. గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి డప్పు చప్పుళ్లు, ఆటపాటలతో తండా పొలిమేరల్లో ఏర్పాటు చేసిన శీత్లా భవాని అమ్మవార్లకు నైవేద్యం తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు.
ఏడు రూపాల్లో శీత్లా భవానికి పూజలు..
దాటుడు పండుగలో శీత్లా భవాని అమ్మవార్లను గిరిజనులు ఏడు రూపాల్లో (మేరమ్మ, తుల్జా, సీత్లా, అంబా భవాని, హింగ్ళా, ధ్వాళాంగర్, కంకాళీ) ప్రతిష్ఠించి కొలుస్తారు. ఉల్లిగడ్డ, మిరపకాయలు, పసుపు కొమ్ములు, జొన్న గుడాలు, బియ్యం, నవధాన్యాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం తండాలోని పశుసంపదపై ఆ నైవేద్యాన్ని చల్లుతారు. ఇలా చేస్తే పశువులు, మూగజీవాలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వారి ప్రగాఢ విశ్వాసం. అనంతరం పచ్చని ప్రకృతిలో అమ్మవార్ల సన్నిధిలో నృత్యాలు చేస్తూ వన భోజనాలు చేస్తారు.
తొమ్మిది రోజుల పాటు నిష్ఠగా పూజలు..
దాటుడు పండుగ అనంతరం తండాలోని పెద్దమనుషులు (నాయక్) ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం, అనుమతి తీసుకుని తీజ్‌ను ప్రారంభిస్తారు. శ్రీతీజ్‌శ్రీ అంటే గోధుమ మొలకలు అని అర్థం. మొదటి రోజు తండా పెద్దల సమక్షంలో గోధుమలు నానబెడతారు. అందంగా అల్లిన బుట్టల్లో మట్టిని నింపి, అందులో ఆ గోధుమ విత్తనాలను నాటుతారు. ఆ బుట్టలను గిరిజన తండాలోని నాయకుడి ఇంటి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచైపె (ఎత్తైన వేదిక) ఉంచుతారు. ప్రతిరోజూ స్వచ్ఛమైన నీటిని తీసుకొచ్చి మొలకల బుట్టలపై చల్లుతారు. తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యువతులు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ కఠిన నియమాలు పాటిస్తారు. ఈ సమయంలో తండాలో మద్యం, మాంసం మానేయడంతో పాటు ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం యువతులు గిరిజన సంప్రదాయ వస్త్రాలు (పేటియా కాంచలి) ధరించి తీజ్ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. తొమ్మిదో రోజుకు బుట్టల్లో ఆకుపచ్చని మొలకలు దట్టంగా పెరుగుతాయి. మొలకలు ఏపుగా పెరిగితే గిరిజనులకు శుభ ఫలితాలు అందుతాయని నమ్మకం. ఇలా అకుంఠిత దీక్షతో ఉంటే యువతులకు మంచి గుణగణాలు గల భర్త లభిస్తాడని ప్రగాఢ విశ్వాసం. వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటామని గిరిజనులు నమ్ముతారు.
తొమ్మిదో రోజు గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్‌కు, మేరమ్మ యాడీ (పార్వతీ దేవి), భవాని మాతలకు ప్రత్యేక పూజలు చేసి బెల్లం, బియ్యంతో వండిన పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం తండా పెద్దల ఆశీర్వాదం తీసుకుని మొలకల బుట్టలను తలపై పెట్టుకుని నృత్యాలు చేస్తూ స్థానిక చెరువులు, కుంటల వద్దకు వెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో తండా యువతులకు వారి సోదరులు కానుకలు ఇస్తారు. భవిష్యత్తులో పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్లే అమ్మాయిలకు ఈ వేడుక ఒక భావోద్వేగభరితమైన వీడ్కోలుగా నిలుస్తుంది.


