కనగల్ : అత్తింటివారి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామంలో శనివారం జరిగిది. ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన ఎస్‌కే హుజపాకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సుంకిశ గ్రామానికి చెందిన షేక్ రజియా(24)తో 2021లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. రజియాపై అనుమానంతో ఆమె భర్త హుజపాతో పాటు అత్తింటి వారు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవారు. వారి వేధింపులు తాళలేక రజియా శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం ఆమెను నల్లగొండకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతిరాలి తండ్రి షేక్ పకీర్‌సాబ్ ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శనివారం పోస్టుమార్టం అనంతరం రజియా మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
వేములపల్లి : రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండల కేంద్రానికి చెందిన చెరుకు సత్యనారాయణ(49) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయల్దేరి శెట్టిపాలెంకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తూ.. శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి దాటుతుండగా నల్లగొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానికులు ఆటోలో మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య చెరుకు పారిజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ద్విచక్ర వాహనంతో పోలీస్ అధికారిని ఢీకొట్టిన బాలుడు
● బాలుడితో పాటు అతడి తండ్రిపై కూడా కేసు నమోదు
నల్లగొండ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాలుడు పోలీస్ అధికారిని ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో బాలుడితో పాటు అతడి తండ్రిపై నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ మేకల అభినవ్ స్టేడియం సమీపంలో టూటౌన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆర్టీసీ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలుడు స్కూటీపై అటుగా వచ్చాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఏఎస్‌ఐ కంచర్ల చంద్రశేఖర్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏఎస్‌ఐకి గాయాలయ్యాయి. ఏఎస్‌ఐ ఫిర్యాదు మేరకు బాలుడితో పాటు అతడి తండ్రిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


