దేవరకొండ : వీధి కుక్క దాడిలో మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వివరాలు.. దేవరకొండ పట్టణంలోని మగ్ధూంబాబ నగర్‌లో నివాసముంటున్న అరుణ్–సోనం దంపతుల మూడేళ్ల కుమార్తె నబియా శనివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుంది. ఈ క్రమంలో కాలనీలో సంచరిస్తున్న వీధి కుక్క నబియాపై దాడి చేయడంతో ఆమె దవడ కింది భాగంలో గల మూడు దంతాలు ఊడిపోయాయి. చిన్నారి అరుపులతో ఇంట్లో నుంచి వచ్చిన తల్లిదండ్రులు హుటాహుటిన దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. దేవరకొండ పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో మృతి
● ఇటీవలే నూతన గృహప్రవేశం
● కొద్దిరోజులకే మృత్యుఒడికి..
చిలుకూరు : ఇంట్లో విద్యుత్ వైర్లు మారుస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చిలుకూరు మండలం ఆర్లెగూడెం గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్లెగూడెం గ్రామానికి చెందిన గొర్రె రాంబాబు(45) వ్యవసాయంతో పాటు ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని ఇటీవలే గృహప్రవేశం చేశాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్న రాంబాబు.. ఇంటి నిర్మాణం సమయంలో పక్కనే ఒక కర్రకు ఏర్పాటు చేసిన విద్యుత్ బాక్స్, వైర్లను ఇంట్లోకి మారుస్తున్నాడు. ఈ క్రమంలో గడ్డపార సహాయంతో విద్యుత్ వైర్లు తీస్తుండగా.. గడ్డపారకు వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్ తెలిపారు.
వైద్యం వికటించి వ్యక్తి మృతి
కుషాయిగూడ(హైదరాబాద్) : వైద్యం వికటించి వ్యక్తి మృతిచెందిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లక్ష్మాపూర్‌కు చెందిన బొల్ల రవి(40) జీవనోపాధి కోసం భార్య, కుమారుడు, కూతురుతో కలిసి కుషాయిగూడకు వలస వచ్చి శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత నెల 31న స్వగ్రామం సమీపంలోని వాసాలమర్రి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. తిరిగి వచ్చి దమ్మాయిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తరువాత ఈ నెల 4న ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో నగరంలోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రవి మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు.


