చౌటుప్పల్ : విద్యార్థులు మల్లఖంబ్ క్రీడలో మంచి పట్టు సాధించి ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథకుమార్ ఆకాంక్షించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ట్రినిటీ స్కూల్‌లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మల్లఖంబ్ రాష్టస్థాయి శిక్షణ శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అత్యంత ప్రాచీణమైన క్రీడగా గుర్తింపు పొందిన మల్లఖంబ్ సాధన విద్యార్థులకు అన్నివిధాలుగా ఉపయోగపడుతుందన్నారు. మల్లఖంబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడను మరింతగా వ్యాప్తి చేసేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమన్నారు. వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 42మంది శిక్షకులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మల్లఖంబ్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ పాటర్న్ కేవీబీ. కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్లఖంబ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉజ్జిని మంజుల, ప్రధాన కార్యదర్శి ముడావత్ గోపాల్, ఎంఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ సాహూ పాల్గొన్నారు.


