ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
ఆలేరు : ఆలేరు రెవెన్యూ డివిజన్ అంశాన్ని పక్కనపెట్టి అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. శుక్రవారం ఆలేరు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆలేరు రెవెన్యూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా గెలిచి 31 నెలలు గడిచినా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రెవెన్యూ డివిజన్ అవసరాన్ని గుర్తించి తానే అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిజిబిలిటీ నివేదిక కోరగా, జిల్లా యంత్రాంగం కూడా డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక పంపిందని వివరించారు. రెవెన్యూ డివిజన్ ఫైల్ సిద్ధంగా ఉందని, ఈ ఫైల్ ఆధారంగా వంద రోజుల్లో డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పుట్ట మల్లేష్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కోమల్ల మౌనిక, జెల్లి నర్సింహులు పాల్గొన్నారు.


