కొత్త పింఛన్లకు నేటి నుంచే దరఖాస్తులు
ప్రభుత్వం ముందుగా ఏడు రకాల ప్రత్యేక పింఛన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు (సింగిల్ ఉమెన్), ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ.. వాటికి తర్వాతి దశలో ప్రాధాన్యతను ఇస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల పరిశీలనను పక్కన పెట్టారు. వీటిపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అలాగే, ఆరోగ్యాధారిత పింఛన్ల కింద తలసేమియా, సికిల్ సెల్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సంబంధించి కూడా ప్రభుత్వం పింఛన్లు ఇవ్వనుంది.
సాక్షి, యాదాద్రి : అర్హులైన నిరుపేదలకు అందించే చేయూత పింఛన్ల మంజూరుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్‌డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పింఛన్ ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ లాగిన్లు ఓపెన్ అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 15 నాటికి అర్హులను ఎంపిక చేసి, సెప్టెంబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 95,296 మంది చేయూత పింఛన్‌దారులు ఉన్నారు.
కొత్త నమూనాలోనే దరఖాస్తులు..
పింఛన్ కోసం అర్హులు గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్‌లోనే దరఖాస్తు చేయడం తప్పనిసరి. గతంలో ప్రజాపాలన, మీసేవ కేంద్రాల్లో లేదా సాధారణ తెల్ల కాగితాలపై దరఖాస్తు చేసిన వారు కూడా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్‌లోనే వివరాలు సమర్పించాలి. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలకు ఈ కొత్త దరఖాస్తు ఫారాన్ని జత చేసి సమర్పిస్తే సరిపోతుంది. లబ్ధిదారుల ఆన్‌లైన్ నమోదుకు వీలుగా దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, సమగ్ర వ్యక్తిగత వివరాలను ఈ ఫారంలో పొందుపరిచారు.
ఎక్కడ దరఖాస్తు చేయాలంటే..
గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో.. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయవచ్చు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు పరిశీలించి ఆన్‌లైన్ లాగిన్‌లో నమోదు చేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డీఆర్‌డీఓ ద్వారా కలెక్టర్ పరిశీలనకు పంపి, తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు.
ముగింపు తేదీ లేదు..
ఈ దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరి తేదీ (డెడ్‌లైన్) లేదు. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
ఫ ఆగస్టు 15 నాటికి ఎంపిక.. సెప్టెంబర్‌లో పంపిణీ
ఫ ముందుగా ఏడు రకాల పింఛన్లకే ప్రభుత్వ ప్రాధాన్యం
ఫ దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు లేదు


